పులి భయం.. నిద్ర కరువు..కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం

పులి భయం.. నిద్ర కరువు..కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం
  • మూడు మండలాల్లోని ప్రజల్లో భయాందోళన  
  • ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్టిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులి 
  • పలు ప్రాంతాల్లో పశువులపైన  దాడి

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట, బిక్కనూరు మండలాల్లోని జనాలకు పులి భయం పట్టుకుంది. ఫారెస్టు ఏరియా లేని ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులకు నిద్ర కరువైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పలు చోట్ల పశువులపై పులి దాడికి పాల్పడింది. గత శనివారం దోమకొండ మండలం అంబారీపేటలో రైతుకు చెందిన ఆవుపై దాడి చేసింది. దీంతో ఆదివారం రాత్రి ఫారెస్టు ఆఫీసర్లు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా పులి రికార్డైంది. గత మూడు రోజులుగా దోమకొండ మండలం అంబారీ పేట, సంగమేశ్వర్, బీబీపేట మండలం మాందాపూర్, ఉప్పర్​పల్లి,  బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి శివారుల్లో పులి సంచరిస్తోంది. సంగమేశ్వర్​, పెద్దమల్లారెడ్డి, ప్రాంతాల్లో రెండు ఆవులను చంపింది. అంబారీపేట శివారులో మరో సారి పశువుపై దాడి చేసింది.  వేర్వేరు మండలాల్లో పశువులపై పులి దాడి చేస్తుండడంతో  స్థానికుల్లో  భయాందోళన నెలకొంది. ఫారెస్టు అధికారులు వెళ్లి  పులి పాద ముద్రలు సేకరించారు.  

ఫారెస్టు లేని చోట సంచారం

కవ్వాల్​ఏరియా నుంచి కామారెడ్డి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు ఫారెస్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కాగా.. ఫారెస్టు ఏరియా లేని దోమకొండ, బీబీపేట, బిక్కనూరు మండలాల్లో పులి సంచరిస్తోంది.  పంట పొలాలు ఉన్న  ఏరియాల్లోని గ్రామాల్లోనే ఎక్కువగా పులి  మంగళవారం పగలు కూడా బీబీపేట మండలం మాందాపూర్, ఉప్పర్​పల్లి శివారులో రైతులకు పులి కనిపించింది. దీంతో పొలం పనులకు,  బైక్​లపై వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. 

పశువులపై పులి దాడి చేసిన ప్రాంతాలను మంగళవారం జిల్లా ఫారెస్టు ఆఫీసర్ నిఖిత, సిబ్బంది పరిశీలించారు.  స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చనిపోయిన పశువులకు పరిహారం ఇస్తామని చెప్పారు.  ఒంటరిగా తిరగొద్దని, అలర్టుగా ఉండాలని దండోరా వేయిస్తున్నారు.  గత ఆర్నెళ్ల కింద కూడా రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో పులి సంచరించింది.  కొద్దిరోజుల తర్వాత పులి జాడ కనిపించలేదు.   తాజాగా జిల్లాలో మరోసారి పులి కలకలం రేపింది.

మేడిపల్లి ఓపెన్​ కాస్ట్​ మట్టి డంప్​లోనే  పెద్దపులి!  

గోదావరిఖని: మహారాష్ట్ర తడోబా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రెండు రోజుల కింద గోదావరి నది దాటి రామగుండం ప్రాంతంలోని మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ అటవీ ఏరియాకు వచ్చిన పెద్దపులి జాడ కోసం ఫారెస్ట్​ ఆఫీసర్లు సెర్చింగ్​చేస్తున్నారు. 

పెద్దపల్లి రేంజ్​ ఆఫీసర్​టి.సతీశ్​కుమార్​నాయక్​ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మూడు టీమ్​లు పెద్దపులి అడుగులు కోసం సెర్చింగ్​చేయగా, వాటి ఆనవాళ్లు కనిపించలేదు. మేడిపల్లి ఓసీపీలో నిర్మించతలపెట్టిన పంప్డ్​వాటర్​స్టోరేజీ ట్యాంక్​వద్ద,  నది ఒడ్డున నీటి కోసం వస్తుందనే ఉద్దేశంతో వెతకగా పులి జాడ కనిపించలేదు. 

నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కడైనా దాగి ఉంటే, దొరకకుండా పోతుందని అధికారులు తెలిపారు. మేడిపల్లి ఓసీపీ ఏరియాలో అడవి పందుల చాలా ఉండగా వాటిని చంపినట్టు ఆనవాళ్లు కూడా కనిపించలేదని చెప్పారు. మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ మట్టి డంప్​లోని అటవీ ప్రాంతంలోనే పెద్దపులి ఉందని, దానికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా సమీప గ్రామాల ప్రజలకు సూచించామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.