- తిర్యాణిలో యథేచ్ఛగా ఆక్రమణలు
- క్వార్టర్స్ దగ్గర షెడ్లు, షాపులు
- రాజకీయ అండదండలతోనే కబ్జాలంటూ ఆరోపణలు
తిర్యాణి, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు మౌనం వహిస్తుండటంతో భూబకాసురులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీ చేసే సిబ్బందికి కేటాయించిన క్వార్టర్స్ ఆవరణలోని భూమిని కొందరు ఆక్రమించి షెడ్లు నిర్మించారని, అక్కడే దర్జాగా షాపులు నడుపుతున్నారు.
ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ భూమిని కూడా కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సర్కారు స్థలాలను ప్లాట్లుగా చూపిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని తెలుస్తోంది. గ్రామాల్లోని పంచాయతీ, రెవెన్యూ శాఖలకు చెందిన ఖాళీ స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆక్రమణల వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని, అందుకే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మండలవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని.. ఆస్పత్రి, ఎస్సీ కాలనీ సహా అన్ని ప్రభుత్వ భూములపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తు న్నారు. కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
