టీచర్ల సర్వీస్ రూల్స్ విడుదల చేయాలి : యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి

టీచర్ల సర్వీస్ రూల్స్ విడుదల చేయాలి :  యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
  •     యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి

ఆసిఫాబాద్, వెలుగు: ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. అన్ని యాజమాన్యాల టీచర్లు, ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలతో చర్చించి ఫిట్​మెంట్ 2023 జులై 1 నుంచి అమలు చేయాలన్నారు. ఆదివారం ఆసిఫాబాద్​ జిల్లా  కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశానికి ఆయన గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి రెండేండ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, డీఏలను విడుదల చేయాలని కోరారు. ఆశ్రమ స్కూళ్ల సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, గురుకులాల్లోని టీచర్లపై బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 

టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులను తగ్గించి ఇన్ సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి ఊశన్న,  జిల్లా ఉపాధ్యక్షుడు సోయం ఇందురావు, కోశాధికారి తంగడిపల్లి రమేశ్, జిల్లా కార్యదర్శులు రాజకమలాకర్‌ రెడ్డి, బూరం దుర్గయ్య, జుట్టు మహిపాల్‌, రోహిత్‌లు, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ అన్నాల సమ్మయ్య పాల్గొన్నారు.