నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో చిన్నారి మృతి దురదృష్టకరం అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ సానుభూతి వెలిబుచ్చారు. ఈ దుర్ఘటనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను కోరడం జరిగిందని చెప్పారు. బాధిత కుటుంబానికి వారంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఈ ఘటనను వాడుకుంటున్నారని.. మాజీ ఎమ్మెల్యే మర్రి దౌర్జన్యాల చిట్టా పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని వంశీ కృష్ణ చెప్పారు. మర్రి ఈ ఘటనను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, సీఎంను విమర్శించడం తగదని హితవు పలికారు.
నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో జరుగుతున్న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి జాతరలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి జాతరలో దైవదర్శనానికి వెళ్తుండగా టికెట్‌కు రూ.100 ఇవ్వాలని ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన భక్తురాలు చంద్రకళను డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఎందుకు ఇవ్వాలని ఆమె ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో నిర్వాహకుడు తల్లితో పాటు రెండు నెలల చిన్నారిని తోసేశాడు. వారు కింద పడడంతో గాయాలయ్యాయి. శనివారం ఉదయం చిన్నారి మృతిచెందింది. శ్రీనివాస్‌రెడ్డి తోసేయడం వల్లే గాయాలై పాప మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనపై నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
