
న్యూఢిల్లీ: ‘‘100 ఏండ్లకు ఒకసారి వచ్చే కరోనా లాంటి మహమ్మారి దుష్ప్రభావాలు 100 రోజుల్లో తొలగిపోతాయని ఎవరూ అనుకోరు. తీవ్రమైన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రతికూల ప్రభావాలను కలిగిస్తున్నది. అయినప్పటికీ ఇండియా ఈ సమస్యల బారిన పడకుండా కొత్త కార్యక్రమాలు చేపడుతున్నది. కొన్ని సాహసాలు చేస్తున్నది. ఇది సవాళ్లతో కూడుకున్న పని” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 10 లక్షల మందిని రిక్రూట్ చేసేందుకు ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ను మోడీ శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 75 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని, పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా కష్టాల్లో ఉన్నాయని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిపోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇండియా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నదని చెప్పారు.
8 ఏండ్లలో ఐదో స్థానానికి..
ప్రభుత్వ విభాగాల పని తీరు ఎంతో మెరుగుపడిందని మోడీ అన్నారు. 10వ అతిపెద్ద ఎకానమీగా ఉన్న ఇండియా.. 8 ఏండ్లలో ఐదో స్థానానికి ఎగబాకిందని చెప్పారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం రంగాలకు ఊతమిచ్చామని అన్నారు. ‘‘ముద్ర పథకం కింద రికార్డు స్థాయిలో రుణాలిచ్చాం. కరోనా సమయంలో రూ.3 లక్షల కోట్లకు పైగా సాయం అందజేసి.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1.5 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం పడకుండా అడ్డుకున్నాం” అని వివరించారు. యువకులకు వీలైనన్ని ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం పని చేస్తున్నదని తెలిపారు. గత 8 ఏండ్లలో ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న కృషిలో రోజ్‌గార్ మేళా ఒక ముఖ్యమైన మైలు రాయి అని చెప్పారు. స్కిల్ ఇండియా కింద 1.25 కోట్ల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. తొలిసారిగా ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) విలువ రూ.4 లక్షల కోట్లను దాటిందని, ఈ సెక్టార్‌లో 4 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. ఒక్క ఆగస్టులోనే 17 లక్షల మంది ఈపీఎఫ్‌వోలో చేరారని, ఇందులో 8 లక్షల మంది 18 నుంచి 25 ఏండ్ల లోపు వాళ్లేనని అన్నారు.
16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడిస్తరు: కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళా.. జుమ్లా కింగ్ ప్రారంభించిన ఈవెంట్ బాజీ అని కాంగ్రెస్ మండిపడింది. దేశ యువతకు 16 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించింది. అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ చెప్పారని, కానీ గత 8 ఏండ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు.