V6 News

ఏ రాష్ట్రంలో లేనివిధంగా  ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏ రాష్ట్రంలో లేనివిధంగా  ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నం :  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, వెలుగు: రానున్న మూడేళ్లలో నల్గొండలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్‌‌లో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్న శ్రీనివాసరావు, పద్మ దంపతులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం రూ.1.70 లక్షల వరకు ఇస్తున్నారని చెప్పారు. నల్గొండ పట్టణంలో ఇప్పటికే 700 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఎల్2, ఎల్3 కేటగిరీలకు సంబంధించిన సమస్యలను క్యాబినెట్‌‌లో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

అవసరమైతే అదనంగా 5 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. పట్టణంలో స్థలాలను పరిశీలిస్తున్నామని, ఆ తర్వాత ఇందిరమ్మ కాలనీ నిర్మిస్తామని తెలిపారు. వడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బందులు తొలగించేందుకు అధికారులు, కలెక్టర్‌‌తో రివ్యూ చేస్తున్నట్లు వెల్లడించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేయర్  బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్  చైర్​పర్సన్  బుర్రి శ్రీనివాస్​రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, రమేశ్, కార్పొరేటర్లు వేణుగోపాల్ రెడ్డి, మామిడి కార్తీక్  ఉన్నారు.