సీఎం కేసీఆర్ చేతిలో 10,348 కోట్లు

సీఎం కేసీఆర్ చేతిలో 10,348 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు కేటాయింపులు చేసింది. నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు పెట్టినప్పుడు భారీ హామీలు ఇచ్చేందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ వద్ద వేల కోట్లు ఉండేలా జాగ్రత్త పడింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరిట రూ.10,348 కోట్లు కేటాయించింది. గతేడాది దాకా ఎస్‌డీఎఫ్‌కు రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తూ వచ్చి, ఈసారి ఐదు రెట్లు పెంచారు. ఈ డబ్బును ఎక్కడ, ఏ పనికి కేటాయించాలనేది సీఎం విచక్షణాధికార పరిధిలోనే ఉంటుంది. ఖాళీ జాగా ఉన్నోళ్లకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున కేటాయిస్తామని బడ్జెట్‌లో సర్కార్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదిలో 2,63,000 కుటుంబాలకు నిధులివ్వాలని టార్గెట్‌గా పెట్టుకోగా, ఇందులో 25 వేల కుటుంబాలను కేసీఆర్‌‌ తన విచక్షణాధికారంతో ఎంపిక చేయనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. దాంతో నియోజకవర్గానికో 210 కుటుంబాలను కేసీఆరే ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు అయింది.

సొంత ప్రచారానికి మస్తు పైసలు

బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకునేందుకు ఈసారి భారీ మొత్తాన్ని సర్కార్ వెచ్చించనుంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ బడ్జెట్‌ను ఏకంగా 608 శాతం పెంచింది. గతేడాది ఐ అండ్‌ పీఆర్‌‌కు రూ.140 కోట్లు మాత్రమే కేటాయించిన సర్కార్, ఈసారి ఏకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా ఐ అండ్ పీఆర్‌‌కు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నయి. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత సర్కార్ డబ్బులతోనే ఇతర రాష్ట్రాల్లోని పత్రికలు, టీవీల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాడ్స్ ఇస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల ఏడాది కావడం, బీఆర్‌‌ఎస్ తరపున ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయనుండడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ సొమ్ముతోనే భారీగా యాడ్స్‌ ఇచ్చే ఉద్దేశంలో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తున్నది.