యూపీలో గాలి దుమారం 104 మంది మృతి..

యూపీలో గాలి దుమారం 104 మంది మృతి..
  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం
  • పెను గాలులకు విరిగిపడిన చెట్లు.. రోడ్లు బ్లాక్
  • పలుచోట్ల కూలిన ఇండ్లు, శిథిలాల కింద నలిగి పలువురు మృత్యువాత
  • బ్రిడ్జి కూలడంతో గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

లక్నో: ఉత్తరప్రదేశ్​లో  పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. బుధవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రమయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల గాలి తుఫాను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పెను గాలుల కారణంగా 104 మంది మృత్యువాత పడ్డారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలుచోట్ల ఇండ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగి వాహనాలు, ఇండ్లపై పడడంతో పలువురు చనిపోయారు. అకాల వర్షం, పిడుగుపాటు కారణంగా మరికొందరు మృత్యువాత పడ్డారు. 

మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రయాగ్​రాజ్​లో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 21 మంది చనిపోయారని చెప్పారు. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో చాలాచోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయని, వాహనాల రాకపోకలకు తీవ్ర జాప్యం కలిగిందని వివరించారు. భదోహి జిల్లాలో 17 మంది, మీర్జాపూర్ లో 15 మంది, ఫతేపూర్ లో 10 మంది మరణించారని పేర్కొన్నారు.  బరేలీ జిల్లాలో పెనుగాలుల ధాటికి ఓ యువకుడు గాల్లోకి లేచి 50 మీటర్ల దూరంలో పడిపోయాడు.

 దీంతో అతడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో అకాల వర్షం, తుఫాన్ బీభత్సం సృష్టించగా బాందా జిల్లా కేంద్రంలో మాత్రం 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్​లో హీట్ వేవ్  వాతావరణం కొనసాగుతోందని పేర్కొంటూ వాతావరణ శాఖ రెండు రాష్ట్రాల్లోని 38 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

  • రెస్క్యూ పనుల్లో ఇబ్బందులు

భారీ వర్షం కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. పెను గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి ఇండ్లపై పడడంతో లోపల చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని వివరించారు. కాగా, అకాల వర్షం, గాలి తుఫాన్ కారణంగా మృత్యువాత పడిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, 24 గంటల్లో ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. 

గాలి దుమారం వల్ల భదోహి జిల్లా​లో గంగా నదిపై ఏర్పాటు చేసిన పాంటూన్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు ప్రయాణికులు నదిలో పడిపోయారు. మీర్జాపూర్ జిల్లాలో గంగా నదిపై ఏర్పాటు చేసిన పాంటూన్ బ్రిడ్జి దెబ్బతింది. దీనివల్ల సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతాప్ గఢ్​లో, డియోరియాలో పిడుగుపాటు కారణంగా నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు.