ఏడాదిన్నరలో 10లక్షల కొలువులు భర్తీ

ఏడాదిన్నరలో 10లక్షల కొలువులు భర్తీ
  • త్వరలోనే డిపార్ట్​మెంట్ల వారీగా నోటిఫికేషన్లు
  • ఐదు డిపార్ట్​మెంట్లలోనే ఎక్కువగా ఖాళీలు
  • మొత్తం శాంక్షన్డ్​ పోస్టులు 40.78 లక్షలు
  • ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు 31.91 లక్షలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పది లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని నరేంద్రమోడీ అనుమతిచ్చారు. దేశవ్యాప్తంగా ఏడాదిన్నరలోపు యుద్ధప్రాతిపదికన రిక్రూట్​మెంట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్​ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్​మెంట్లలోని ఉద్యోగాల సంఖ్య, ఖాళీలపై ఇటీవల ప్రధాని రివ్యూ నిర్వహించారు. ఖాళీలను గుర్తించి, భర్తీ కోసం నిర్ణయం తీసుకున్నారు. ‘‘అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని హ్యూమన్​ రిసోర్స్​పై ప్రధాని సమీక్ష చేపట్టారు. రాబోయే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయాలని ఆదేశించారు” అని ట్వీట్​లో పీఎంవో పేర్కొంది. త్వరలోనే డిపార్ట్​మెంట్ల వారీగా వేకెన్సీల వివరాలను, నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలు నిరుద్యోగ సమస్యలపై కేంద్రాన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. ఇదే సమస్యతో 2024  జనరల్​ ఎలక్షన్స్​లో  మోడీ సర్కార్​ను ఎదుర్కోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. తాజా ప్రకటనతో ఆ విమర్శలకు కేంద్రం చెక్​ పెట్టినట్లయిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 

21.75 శాతం ఖాళీలు

కేంద్రంలో 2020 మార్చి 1 నాటికి 21.75 శాతం ఖాళీలు ఉన్నట్లు వేతనాలు, భత్యాల ఖర్చులు చూసే శాఖ  (డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎక్స్​పెండిచర్​ ఆన్​ పే అండ్​ అలవెన్స్) నిరుడు వార్షిక రిపోర్టులో పేర్కొంది. దాని  ప్రకారం..  40.78 లక్షల శాంక్షన్డ్​ పోస్టులు ఉండగా, అందులో 31.91 లక్షల మంది రెగ్యులర్​ ఎంప్లాయీస్​ పనిచేస్తున్నారు. దాదాపు 21.75% ఖాళీలు ఉన్నాయి. 2020 మార్చి 1 వరకు ఎనిమిదిన్నర లక్షల ఖాళీలు ఉన్నట్లు గతంలో పార్లమెంట్​లో కేంద్రం కూడా ప్రకటించింది. 

మొత్తం పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఐదు ప్రధాన మంత్రిత్వ శాఖలు, డిపార్ట్​మెంట్లలోనే 92 శాతం (31.33 లక్షలు) మంది ఉన్నారు. ఇందులో రైల్వేస్​లో 40.55 శాతం, హోం అఫైర్స్​లో 30.5శాతం, డిఫెన్స్​ (సివిల్​)లో 12.31, పోస్టల్​లో 5.66 శాతం, రెవెన్యూలో 3.26 శాతం మంది పనిచేస్తున్నారు. మరో 7.72 శాతం ఇతర విభాగాల్లో పనిచేస్తున్నట్లు వార్షిక రిపోర్టు చెప్తున్నది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీస్​ కోసం  రూ. 2,08,960.17 కోట్లు ఖర్చు చేయగా.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,25,744.7 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. 

ఐదు డిపార్ట్​మెంట్లలోనే ఎక్కువ ఖాళీలు

2020 మార్చి 1 వరకు ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎక్స్​ఫెండీచర్​ వార్షిక రిపోర్టు చెప్తున్నప్పటికీ ఈ రెండేండ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడి అవి పది లక్షలు దాటాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే పది లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోడీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని అంటున్నాయి.  ప్రధానంగా పోస్టల్​, డిఫెన్స్​ (సివిల్​), రైల్వేస్​, రెవెన్యూ, హోం అఫైర్స్​లో ఎక్కువగా ఖాళీలు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. రైల్వేస్​లో 15 లక్షల వరకు శాంక్షన్డ్​ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 2.3 లక్షల ఖాళీలు ఉన్నాయి. డిఫెన్స్​ (సివిల్​) డిపార్ట్​మెంట్​లో దాదాపు 6.33 లక్షల శాంక్షన్డ్​ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. పోస్టల్​ డిపార్ట్​మెంట్​లో 2.67 లక్షల శాంక్షన్డ్​ పోస్టులకు గాను.. ప్రస్తుతం 90 వేల ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో 1.78 లక్షల శాంక్షన్డ్​ పోస్టులకు గాను.. 74 వేల ఖాళీలు ఉన్నాయి. హోం అఫైర్స్​లో 10.8 లక్షల శాంక్షన్డ్​ పోస్టులు ఉండగా.. అందులో దాదాపు 1.3 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు భర్తీ కాక ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతున్నదని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ప్రధాని మోడీ తాజా ప్రకటనతో పోస్టులు భర్తీ అయితే.. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని, కొత్తవారికి అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఈ కొలువుల జాతర తమ ప్రభుత్వానికి మరింత పాజిటివ్​ వేవ్​ను తీసుకువస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఉద్యోగాల భర్తీ ప్రకటనపై విమర్శలు సంధించాయి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ లెక్కన ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, కానీ 10 లక్షల ఉద్యోగాలంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డాయి. 

ఇది మహా జుమ్లా: రాహుల్​

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎనిమిదేండ్ల కింద మోడీ హామీ ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో 10 లక్షల ఉద్యోగాలంటూ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ విమర్శించారు. ‘‘ఇది జుమ్లా ప్రభుత్వమే కాదు.. మహా జుమ్లా ప్రభుత్వం.  ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ఉద్యోగాలు సృష్టించడంలో ప్రధాని మోడీ నిపుణుడు కాదు.. కానీ, ఉద్యోగాల వార్తలు సృష్టించడంలో మాత్రం నిపుణుడు” అంటూ ట్విట్టర్​లో దుయ్యబట్టారు.