కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి

కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి చెందింది.  2024 జనవరి 16 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం శౌర్యా అనే చీతా మృతిచెందినట్లు పార్క్‌ సిబ్బంది తెలిపారు. దీంతో  కలిపి ఏడాది వ్యవధిలో ఇప్పటి వరకు 10 చీతాలు మృతి చెందాయి.  కునోలో తొమ్మిదవ చిరుత మరణం గతేడాది ఆగస్టు 2న నమోదైంది.  

పోస్ట్‌మార్టం తర్వాత చీతా  మరణానికి గల కారణం తెలుస్తుందని అధికారి తెలిపారు. ఇప్పటివరకు కునో నేషనల్‌ పార్క్‌లో ఏడు పెద్ద, మూడు పిల్ల చీతాలు మరణించాయి.   చివరి రెండు చీతాల మరణాలకు వర్షాకాలంలో కీటకాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లే కారణమని  కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొంది. 

భారత్ లో  చిరుతల సంఖ్యను పెంచే లక్ష్యంతో కేంద్రం  ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 20 చిరుతలను  తీసుకొచ్చింది. తొలి విడతలో నమీబియా నుంచి 8 చిరుతలు భారత్ కు వచ్చాయి.  వాటిని మధ్యప్రదేశ్ రాష్ట్రం కునో నేషనల్ పార్కులోని ఎన్‌క్లోజర్‌లోకి ప్రధాని నరేంద్ర మోడీ  వదిలారు. ఆ తర్వాత రెండో విడతలో  దక్షిణాఫ్రికా నుంచి 12  చిరుతలు వచ్చాయి. వాటిలో ఐదు ఆడ చిరుతలు.  మొత్తం 20 చిరుతలు కునో నేషనల్ పార్కు‌కు‌రాగా వాటికి పేర్లుసైతం పెట్టారు.