సికింద్రాబాద్ బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకున్నాయి. స్క్రాప్ గోడౌన్ లో కావటంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్ లో  12 మంది కార్మికులు ఉన్నారు. వారిలో ప్రేమ్ అనే కార్మికుడు గోడ దూకి ప్రాణాలతో బయటపడ్డారు. బాధితుడు శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉండటంతో పోలీసులు గాంధీకి తరలించారు.  8 ఫైరింజన్లతో తెల్లవారుజాము వరకు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. సెంట్రల్ జోన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 


స్క్రాప్ గోడౌన్ పక్కనే టింబర్ డిపోలు ఉండటంతో అంతా టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగినట్లు భావించారు. అగ్నిప్రమాదంతో ఘటనా స్థలంలో భారీగా పొగ కమ్ముకుంది. చనిపోయిన కార్మికులంతా బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.  చనిపోయినవారంతా 17 నుంచి 35 ఏళ్ల మధ్యవాళ్లే ఉన్నారు. చనిపోయిన వారిలో బిట్టు, సత్యేందర్, దినేష్, దామోదర్, చింటు, సికిందర్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్ ఉన్నారు. గోలు ఆచూకీ తెలియాల్సి ఉంది.