అవార్డు వేడుకలో విషాదం.. వడదెబ్బతో 11 మంది మృతి

అవార్డు వేడుకలో విషాదం.. వడదెబ్బతో 11 మంది మృతి

నవీ ముంబై:  మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిన ఒక అవార్డ్ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఎండ విపరీతంగా ఉండటంతో వడదెబ్బకు గురై 11 మంది చనిపోయారు. మరో 50 మంది ఆస్పత్రిలో చేరారు. నవీ ముంబైలోని ఓ గ్రౌండ్​లో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ దత్తాత్రేయ నారాయణ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవార్డును అందజేశారు. సీఎం ఏక్​నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ ఫాలోవర్లు వేలాది మంది తరలివచ్చారు.

మరోవైపు గ్రౌండ్​లో టెంట్లు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయకపోవడంతో వచ్చిన వాళ్లంతా నేలపైనే కూర్చున్నారు. ఉదయం 11.30కు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 1కి ముగిసింది. దీంతో రెండు మూడు గంటలపాటు ఎండలోనే ఉండటంతో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తీవ్రంగా వడదెబ్బ బారిన పడిన 11 మంది మరణించారు. మరో 50 మంది ఆస్పత్రిలో చేరగా, 26 మంది డిశ్చార్జ్ అయ్యారు. అవార్డుల వేడుకలో విషాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని సీఎం షిండే అన్నారు.

ఆస్పత్రిలో బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. కాగా, ఆదివారం నవీ ముంబైలో రికార్డ్ స్థాయిలో 38 డిగ్రీల గరిష్ట టెంపరేచర్ నమోదైంది.