బార్‎లో కాల్పుల కలకలం.. 11 మంది మృతి.. 14 మందికి తీవ్ర గాయాలు

బార్‎లో కాల్పుల కలకలం.. 11 మంది మృతి.. 14 మందికి తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు ఓ బార్‌లో జరిపిన సామూహిక కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా కనీసం 11 మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణాఫ్రికా పరిపాలనా రాజధాని ప్రిటోరియా సమీపంలోని ఒక టౌన్‌షిప్‌లోని బార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

శనివారం (డిసెంబర్ 6) ప్రిటోరియాకు పశ్చిమాన ఉన్న సౌల్స్‌విల్లే టౌన్‌షిప్‌లోని లైసెన్స్ లేని ఓ బార్‌లో కాల్పులు జరిగినట్లు దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 11 మరణించగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3,12 ఏళ్ల బాలురు, 16 ఏళ్ల బాలిక ఉన్నారు.

 సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని.. ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.