బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11 మంది సజీవ దహనం

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11 మంది సజీవ దహనం

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని శివకాశీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు మరియమ్మల్ ఫైర్ వర్క్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. సత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 22 మంది కూలీలను చేర్చారు. వారికి 50 శాతం గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. కానీ అందులో ఉన్న మండే స్వభావం గల ద్రావణంతో మంటలు ఆరడం లేదు. దీంతో లోపలికి వెళ్లడానికి వీలుకావడం లేదు.

ప్రమాదంపై స్పందించారు తమిళనాడు సీఎం పళనిస్వామి. జిల్లా అధికారులతో మాట్లాడనని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బాణాసంచా తయారీ పరిశ్రమలను రోజువారీ తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల పరిహారం అందిస్తామని ట్వీట్ చేశారు.

ప్రమాదంపై తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.