- ముంబైకి తరలించి వ్యభిచార కూపంలోకి దింపిన ముఠా
- 2015 లో కేసు నమోదు చేసిన సీఐడీ, 38 మంది బాధితుల రెస్క్యూ, 45 మంది అరెస్ట్
- 11 ఏండ్లుగా విచారణ బుధవారం తీర్పు
- ఐదుగురికి జీవిత ఖైదు.. మరో 28 మందికి కఠిన కారాగార శిక్ష
- 9 మంది బాధిత బాలికలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
హైదరాబాద్, వెలుగు: బాలికల అక్రమ రవాణా, వ్యభిచారం, లైంగిక దాడి కేసులో హైదరాబాద్ నాంపల్లి హకా భవన్‌లోని పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 33 మంది నిందితులను దోషులుగా తేల్చి బుధవారం శిక్షలు ఖరారు చేసింది. ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. మరో ముగ్గురికి 14 ఏండ్లు, 25 మందికి మూడు నుంచి పదేండ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. 9 మంది మైనర్ బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ, విమెన్ సేఫ్టీ వింగ్ వివరాలు వెల్లడించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీస్ అధికారులను ప్రాసిక్యూషన్ డైరెక్టర్ సాంబశివరెడ్డి అభినందించారు.
ఉద్యోగాల పేరుతో వ్యభిచార కూపంలోకి..
ఖమ్మం జిల్లా పరిసర గ్రామాలకు చెందిన 38 మంది బాలికలు, యువతులను ఓ ముఠా 2015లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ముంబైకి తరలించింది. అక్కడి చంద్రపూర్, బల్లార్షా ప్రాంతాల్లోని వ్యభిచార ముఠాలకు ఒక్కొక్కరిని రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు విలువ కట్టి అమ్మేశారు. అనంతరం రెడ్‌లైట్ ఏరియాల్లోని వ్యభిచార గృహాల్లో బంధించి వ్యభిచారంలోకి దింపింది.
బాధితుల్లో ఓ బాలిక సుమారు నాలుగు నెలల పాటు వ్యభిచార గృహంలో బంధీగా ఉంది. ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సహకారంతో 2015 జులై 17న సీఐడీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజ్వల ఎన్‌జీవో ప్రతినిధులతో కలిసి సీఐడీ పోలీసులు మహారాష్ట్రలో సోదాలు నిర్వహించారు. చంద్రపూర్, బల్లార్షాలోని వ్యభిచార గృహాలపై దాడులు చేసి 9 మంది మైనర్లతో పాటు మొత్తం 38 మంది బాధితులను రెస్క్యూ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
నాంపల్లి కోర్డులో విచారణ.. 11 ఏండ్ల తర్వాత తీర్పు..
కేసులో ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌కు చెందిన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చెందిన 45 మందిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నాంపల్లి హకా భవన్‌లోని పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టులో నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. 38 మంది బాధితులు, దర్యాప్తు అధికారులు సహా పలువురిని సాక్షులుగా కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమాదేవి వాదనలు వినిపించారు. కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘంగా 11 ఏండ్ల పాటు సాగిన విచారణ తర్వాత కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
