- కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇయ్యకుంటే ఇండిపెండెంట్‍గా పోటీచేస్తా
- బీసీ నేతలను సీఎం రేవంత్, పొంగులేటి, వేం నరేందర్‍రెడ్డి తొక్కేస్తున్నరని కామెంట్
వరంగల్, వెలుగు: ‘పరకాల నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే నేనే.. రాబోయే 20 ఏండ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటా.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా.. ఇంకెవరు చెప్పినా పరకాల నియోజకవర్గం కొండా కుటుంబానిదే’ అని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‍గా పోటీచేస్తానని.. రేవూరి తరఫున రేవంత్ రెడ్డి వచ్చిప్రచారం చేసినా గెలుపు తనదేనని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండలో బుధవారం మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలకు సుస్మిత ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని కొండా దంపతులు ప్రపోజ్ చేశారని, అప్పట్లో కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాటిచ్చి ఆ తర్వాత అన్యాయం చేశారని సుస్మిత ఆరోపించారు. ‘రేవూరి అంటే పరకాలకు తెలియదు. పరకాల అంటే రేవూరికి తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి అడిగాడనే ఒకే ఒక్క కారణంతో కొండా దంపతులు అన్నీతామై రేవూరిని గెలిపించారు.
అలాంటి సీఎం మొన్నటి పరకాల సభలో రేవూరిని వచ్చే ఎలక్షన్లలో మరోసారి గెలిపించాలని ఎలా కోరుతారు. బీసీలను కాదని రేవూరిని గెలిపించాలని చెప్పడంలో ఆంతర్యమేమిటి’ అని నిలదీశారు. సీఎం రేవంత్‍రెడ్డితో పాటు ఆయన టీం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలను అవమానిస్తూ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కొండా మురళీని, బీసీలను ఎందుకు తొక్కుతున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
సుస్మితకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు: ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి
సీఎం రేవంత్‍రెడ్డితో పాటు ఇతర మంత్రులపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి ఖండించారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బీఆర్‍ఎస్ నేతలు చేసిన విమర్శలపై బుధవారం హనుమకొండ డీసీసీ భవన్‍లో రేవూరి, నాగరాజు ప్రెస్‍మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సుస్మిత కామెంట్స్‌పై మీడియా అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే నాగరాజు స్పందించారు.
నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుస్మితకు సంబంధంలేదని, అసలు ఆమెకు పార్టీ సభ్యత్వమే లేదన్నారు. ఇంతకంటే తాము ఎక్కువ స్పందించమని చెప్పారు. రేవూరి మాట్లాడుతూ.. సుస్మిత పటేల్ కామెంట్స్‌పై తాను స్పందించి తనస్థాయి తగ్గించుకోనని చెప్పారు. పరకాల సభకు రావాలని తాను మంత్రి కొండా సురేఖకు ఫోన్‍చేసి చెప్పానన్నారు. ఆమె సైతం వస్తానని చెప్పారని..ఎందుకు రాలేదో తెలియదన్నారు. తనకు కొండా ఫ్యామిలీకి ఎటువంటి విభేదాలు లేవన్నారు.
