
ఈరోజుల్లో చిన్నపిల్లలు సైతం బండ్లేసుకొని రోడ్లపై తెగ తిరిగేస్తున్నారు. స్కూళ్లకు కూడా బైక్ లో వెళ్లే పిల్లలు చాలామంది ఉన్నారు. మైనర్లకు బండ్లు ఇచ్చి పంపిన తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా జనాల్లో మార్పు రావట్లేదు. సికింద్రాబాద్ లో మైనర్ డ్రైవింగ్ ఓ బాలుడి ప్రాణం బలయ్యింది. బుధవారం ( అక్టోబర్ 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేటలో మైనర్ డ్రైవింగ్ కి ఓ బాలుడి ప్రాణం బలయ్యింది. బైక్ పై అతివేగంగా వచ్చిన ఇద్దరు మైనర్లు.. అటు వైపు నుంచి వేగంగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో 11 ఏళ్ళ బాలుడు సయ్యద్ మృతి చెందాడు. బాలుడి మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మైనర్లకు బైక్ లు ఇచ్చి రోడ్లపైకి పంపొద్దని.. తమకు ప్రాణాలు రిస్క్ లో పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. మైనర్లకు బండ్లు ఇచ్చే పేరెంట్స్ పై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.