
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు సకాలంలో పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ 8604 హైస్కూళ్లకు చెందిన ఆరో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు 1.11 కోట్ల నోట్ బుక్స్ అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలకు నోట్ బుక్స్ సరఫరా కూడా కొనసాగుతోంది.
అయితే, తాజాగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకూ నోట్ బుక్స్ అందించాలని సర్కారు డిసైడ్ అయింది. ఇప్పటికే జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ల ఆధారంగా సరఫరా చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ సరఫరా ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు సూచించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్స్ పంపిణీని ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించామని, దాంట్లో వివరాలను అప్డేట్ చేయాలని డీఈఓలను ఆదేశించారు.