అసలే యుద్ధం.. మళ్లీ భూకంపం.. ఇరాన్లో 4.3 తీవ్రతతో ప్రకంపనలు

అసలే యుద్ధం.. మళ్లీ భూకంపం.. ఇరాన్లో 4.3 తీవ్రతతో ప్రకంపనలు

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అంటుంటారు కదా.. అలా ఉంది ఇరాన్ పరిస్థితి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ రెండూ కలిసి దాడులు చేస్తుండటంతో అల్లకల్లోల పరిస్థితి. దాడులను తిప్పికొట్టేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతున్న క్రమంలో.. ఇరాన్ లో భూకంపం రావటం ఆ దేశ ప్రజలను ఆందోళనలకు గురిచేసింది. 

మంగళవారం (మార్చి 03) దక్షిణ ఇరాన్ ఫార్స్ ప్రావిన్స్ లోని ఖొంజ్ సమీపంలో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. 10 కి.మీ. లోతులో భూకంపం ఏర్పడింది. స్థానిక ఇరాన్ సమయం ప్రకారం..  ఉదయం 10.24 సమయంలో ఎర్త్ క్వేక్ ఏర్పడింది. జెరాష్ కు నార్త్ వెస్ట్ (వాయువ్యం) లో 55 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 

అయితే ఈ భూకంపం అంతగా భయపడాల్సింది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సాధారణంగా కంపించడమేనన్నారు. ఎపిసెంటర్ దగ్గర భూమి కదిలినట్లు అనిపిస్తుందని చెప్పారు. ఎలంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే సీరియస్ డ్యామేజ్, గాయాలు అయినట్లు ఎలాంటి సమాచారం ఇంకా రాలేదు. సునామీ వచ్చే అవకాశం లేదని ప్రకటించారు. 

2026, మార్చి 03న ఒకే రోజు రెండు దేశాలలో భూకంపాలు రావడం గమనార్హం. ఉదయం డోనేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూమి ఊగిపోయింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూ కంపం కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే  ప్రకటించింది. ఇది చాలా శక్తింవంతమైన భూకంపం అని స్పష్టం చేసింది ఈ సర్వే రిపోర్ట్. 

సినాబాంగ్ కు ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు ప్రకటించారు అధికారులు. దీని వల్ల ఇండోనేషియాలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తీవ్ర స్థాయిలో భూమి కంపించటంతో.. జనం రోడ్లపైకి వచ్చారు. కొన్ని చోట్ల రోడ్లు చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు. ఎలాంటి సునామీ వార్నింగ్స్ ఇవ్వలేదు అధికారులు. భూకంపం కేంద్రం సముద్రంలో ఉండటంతో.. గతంలో వచ్చిన సునామీ సైతం ఇదే ప్రాంతంలో భూకంపం రావటం వల్లే జరగటంతో.. జనంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.