బీజేపీ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపిన బ్రిడ్జి ప్రమాదం

బీజేపీ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపిన  బ్రిడ్జి ప్రమాదం

గుజరాత్ లోని మోర్బీ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 132మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. మరెంతోమంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఓ బీజేపీ ఎంపీ కుటుంబానికీ విషాదాన్ని మిగిల్చింది. రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ మోహన్‌బాయ్ కళ్యాణ్ జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులుఏకంగా 12 మందిని కోల్పోవడం తీరని విషాదాన్ని నింపింది. నిన్న జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో తన కుటుంబంలోని 12 మందిని కోల్పోయినట్లు ఎంపీ కుందారియా తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని, వారంతా తన సోదరి కుటుంబసభ్యులని స్పష్టం చేశారు.

ఇక ఈ కేబుల్ బ్రిడ్జి ఘటన అనంతరం అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఎంపీ మోహన్ బాయ్ కళ్యాణ్ జీ పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, ప్రధాని మోడీ సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.