12ఏళ్ల బాలికపై అమానుషం.. అత్యంత కిరాతకంగా దాడి

12ఏళ్ల బాలికపై అమానుషం.. అత్యంత కిరాతకంగా దాడి

మధ్యప్రదేశ్‌లోని దారుణం చోటుచేసుకుంది. 12ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, గాయపర్చిన ఈ అమానవీయ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సత్నా జిల్లాలోని మైహార్ పట్టణంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని నిర్వహిస్తున్న ఒక ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. జూలై 27న బాలికను ఏకాంత ప్రదేశానికి రప్పించి, దాడికి పాల్పడ్డారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు తీవ్ర రక్తస్రావమైన బాలికను వైద్య సంరక్షణ కోసం డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ రీవాలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో నిందితులను రవీంద్ర కుమార్ రవి, అతుల్ భడోలియాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు బాలిక ప్రైవేటు భాగాల్లో ఓ గట్టి వస్తువును చొప్పించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, బాధితురాలి వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే ఈ విషయం నిర్ధారించగలమని అధికారులు స్పష్టం చేశారు. “నిందితులు రవీంద్ర కుమార్ రవి, అతుల్ భడోలియాలు 12 ఏళ్ల చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌లో కర్ర లేదా మరేదైనా వస్తువును చొప్పించి ఉంటారని భావిస్తున్నాం. అయితే ఇది కేవలం మెడికల్ రిపోర్టు వచ్చాకే నిర్ధారించగలుగుతాం. ప్రస్తుతం ఆమె మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవడంతో ఆస్పత్రిలో చేర్చించాం. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు ”అని సత్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ గుప్తా తెలిపారు.

"ఆమె శరీరం లైంగిక వేధింపులకు సంబంధించిన గాట్లు, గాయాలు ఉన్నాయని" అధికారులు చెబుతున్నారు. ఇక బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 30 ఏళ్ల వయసున్న నిందితులను జూలై 28న స్థానిక కోర్టులో హాజరుపరిచామని, వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని చెప్పారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 376డిబి (12 ఏళ్లలోపు మహిళపై సామూహిక అత్యాచారానికి శిక్ష), 366A (మైనర్ బాలికను స్వాధీనం చేసుకోవడం), 323 (గాయపరచడం), 324 కింద కేసు నమోదు చేశారు.

 

 

मैहर में बेटी के साथ दुष्कर्म की जानकारी मिली है, मन पीड़ा से भरा हुआ है, व्यथित हूं।

मैंने पुलिस को निर्देश दिए हैं कि कोई भी अपराधी बचना नहीं चाहिए
पुलिस ने अपराधियों को गिरफ्तार कर लिया है ।

प्रशासन को निर्देश दिए हैं कि बेटी के समुचित इलाज की व्यवस्था की जाए ।

कोई भी…

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 28, 2023
 
 
 

ఇక నిందితుల గురించి తెలిసిన ట్రస్టు నిర్వాహకులు వారిని ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై తాజాగా ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాలికకు సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించారు. “మైహార్‌లో జరిగిన అత్యాచారం గురించి నాకు సమాచారం అందింది. ఈ ఘటన నన్నెంతో బాధించింది. పోలీసులు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాం. ఏ నేరస్థుడూ తప్పించుకోలేడు, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చౌహాన్ అన్నారు.

ఈ ఘటనను ఖండిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసును తలపించే విధంగా బాధితురాలిపై అమానుష దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఇలా మహిళలపై ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయని, వారికి భద్రత కల్పించడంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం విఫలమైందని.. అది ఈ ఘటనతో రుజువు చేసిందని నాథ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. బాలికకు ఉత్తమ వైద్యం అందించి కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.