కూకట్పల్లిలో 1.20 ఎకరాల భూమి స్వాధీనం.. రూ. 100 కోట్ల ప్రభుత్వ భూమికి కంచె వేసిన హైడ్రా

కూకట్పల్లిలో 1.20 ఎకరాల భూమి స్వాధీనం.. రూ. 100 కోట్ల ప్రభుత్వ భూమికి కంచె వేసిన హైడ్రా

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పరిధిలోని ఆల్విన్​కాలనీలో సుమారు రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా వివాదాస్పదంగా మారిన భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూకట్​పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్​ 276లో మొత్తం 1.39 ఎకరాల భూమి ఉండగా, ఇప్పటికే కొంత భూమి ఆక్రమణలకు గురైంది. 

ఆల్విన్​కాలనీ మధ్యలో ఉండడం వల్ల ఈ భూమి విలువ కనీసం రూ.వంద కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమిని కూడా కబ్జా చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ భూమి తమదంటూ ఆల్విన్​ఎంప్లాయిస్​హౌసింగ్​సొసైటీ పోరాడుతూ వస్తుంది. అదే సమయంలో ఆల్విన్​కాలనీ సంక్షేమ సంఘం మాత్రం ఈ భూమిని కాపాడి పార్క్​గా అభివృద్ధి చేయాలని డిమాండ్​చేస్తూ వచ్చింది. 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆల్విన్​ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగుల కోసం సర్వే నంబర్​ 276లోని 79.29 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని రెండు దశల్లో ప్లాట్లుగా విభజించి ఆల్విన్​ఉద్యోగులకు కేటయించారు. 

అప్పటికీ కొందరు ఉద్యోగులు మిగిలిపోవడంతో కాలనీని ఆనుకుని ఉన్న ఇదే సర్వేనెంబర్ 276​లోని 2.39 ఎకరాల భూమిని కూడా తమ సొసైటీకి కేటాయించాలని ఆల్విన్​ హౌసింగ్​ సొసైటీ కోరుతూ వచ్చింది. ఇందుకోసం సొసైటీ తరఫున ప్రభుత్వానికి డబ్బు కూడా చెల్లించామని సొసైటీ చెబుతుండగా, ఇదంతా అబద్ధమని సంక్షేమ సంఘం ఆరోపిస్తుంది. 

ఈ క్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిథులు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ని కలిసి ప్రజావాణిలోఈ భూమి విషయమై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ విషయంపై విచారణ చేసిన హైడ్రా 2.39 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని నిర్ధారించుకుంది. ఇప్పటికే ఇండ్లు వచ్చిన ప్రాంతాన్ని వదిలేసి.. బుధవారం మిగిలిన 1.20 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు.