121 మంది అభ్యర్థులు చదువురానివాళ్లే

121 మంది అభ్యర్థులు చదువురానివాళ్లే
  •     5 దాకా చదివినోళ్లు 359 మంది
  •     లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసినోళ్ల విద్యార్హతలు వెల్లడించిన ఏడీఆర్

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల్లో పోటీకి దిగినవాళ్లలో 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులమని ప్రకటించుకున్నారు. ఇంకో 359 మంది తాము 5వ తరగతి దాకా చదువుకున్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం రిపోర్టును విడుదల చేసింది. ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8,360 మంది పోటీ చేయగా, 8,337 మంది అభ్యర్థుల విద్యార్హతలను ఏడీఆర్ వెల్లడించింది.

ఇప్పటికే ఐదు ఫేజ్​లలో ఎన్నికలు పూర్తి కాగా, ఈ నెల25న ఆరో విడత, జూన్ 1న చివరి ఫేజ్​తో ఎన్నికలు ముగియనున్నాయి. లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగినోళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్ మధ్య చదివినోళ్లు 3,482 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. డిగ్రీ లేదా ఆపై చదివినోళ్లు 4,211 మంది, డాక్టరేట్ సాధించినవాళ్లు 198 మంది అభ్యర్థులు ఉన్నారు. డిప్లొమా చదివినోళ్లు 42 మంది ఉండగా, కేవలం తాము చదువుకున్నవాళ్లమని 195 మంది ప్రకటించుకున్నారు. ఇక 29 మంది తమ విద్యార్హతలను వెల్లడించలేదని ఏడీఆర్ రిపోర్టు తెలిపింది.