మూడో ఫేజ్​లో స్త్రీలు 123 మందే .. పోటీలో మొత్తం 1,352 మంది

మూడో ఫేజ్​లో స్త్రీలు 123 మందే ..  పోటీలో మొత్తం 1,352 మంది

 న్యూఢిల్లీ: మే 7న జరగనున్న లోక్ సభ మూడో ఫేజ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది (29%) కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.5.66 కోట్లుగా ఉంది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రిపోర్టు వెల్లడించింది. ఏడీఆర్, ది నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి ఈ రిపోర్టును తయారు చేశాయి. మూడో ఫేజ్ లో పోటీ చేస్తున్న మొత్తం 1,352 మంది అభ్యర్థుల్లో కేవలం 123 మంది (9%) మాత్రమే మహిళలు ఉన్నారని రిపోర్టులో తేలింది. 244 మందిపై (18%) క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడైంది. ఐదుగురిపై మర్డర్ కేసులు, 24 మందిపై హత్యాయత్నం కేసులు, 38 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు, 17 మందిపై విద్వేషపూరిత ప్రసంగాల కేసులు నమోదైనట్టు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ లాంటి ప్రధాన పార్టీల అభ్యర్థులపై కేసులు ఉన్నాయని పేర్కొంది. 

591 మంది గ్రాడ్యుయేట్స్.. 

మూడో ఫేజ్​లో పోటీ చేస్తున్న మొత్తం 1,352 మంది అభ్యర్థుల్లో 591 మంది (44%) గ్రాడ్యుయేట్స్ ఉన్నారని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్నోళ్లు 639 మంది (47%) ఉన్నారని తెలిపింది. ఏజ్ పరంగా చూస్తే 25 నుంచి 40 ఏండ్ల వయసున్న అభ్యర్థులు 411 మంది (30%), 41 నుంచి 60 ఏండ్ల వయసున్న అభ్యర్థులు 712 మంది (53%) ఉన్నారని పేర్కొంది.