అంబేద్కర్ విగ్రహం పనులు పరిశీలించిన మంత్రి వేముల

అంబేద్కర్ విగ్రహం పనులు పరిశీలించిన మంత్రి వేముల

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హుసేన్ సాగర్ తీరంలో  ట్యాంక్ బండ్ పై 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిష్టాత్మక రీతిలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను  మంత్రి వేముల  ప్రశాంత్ రెడ్డి పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విగ్రహం కింద ఉన్న ప్లేస్ లో అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రదర్శించేందుకు మినీ థియేటర్ ను నిర్మించనున్నారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. అంబేద్కర్ జయంతిలోపు పనులన్నీ పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకుని స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ రచనలు, ప్రత్యక్ష ప్రసంగాలు,  సినిమాల్లో అంబేద్కర్ గురించిన ప్రసంగాలు, ఘట్టాలను చూపించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.