13 స్థానాల్లో గంట ముందే పోలింగ్ బంద్​

13 స్థానాల్లో గంట ముందే పోలింగ్ బంద్​
  • గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో 
  • 4 గంటల వరకే ఓటింగ్​మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సమస్యాత్మక  నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌‌‌‌ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మావోయిస్టుల ప్రభావం ఉండే  గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌‌ జరగనుంది. 

మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌‌ నిర్వహించనున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అటవీ, సమస్యాత్మక ప్రాంతాల నుంచి పోలింగ్ బాక్సులు నియోజకవర్గ కేంద్రాలకు సకాలంలో తరలించేందుకు వీలుగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. గంట ముందే పోలింగ్​ముగించే నియోజకవర్గాల్లో మంథని, చెన్నూరు, సిర్పూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం ఉన్నాయి.  గతంలోనూ ఈ నియోజకవర్గాల్లో పోలింగ్​ టైమ్​ను గంట తగ్గించారు.