సిద్దిపేట జిల్లాలో స్పౌజ్ టీచర్ల 13 కి.మీ పాదయాత్ర

సిద్దిపేట జిల్లాలో స్పౌజ్ టీచర్ల 13 కి.మీ పాదయాత్ర

సిద్దిపేట రూరల్​, వెలుగు: భర్త ఒక జిల్లాలో.. భార్య మరో జిల్లాలో పనిచేయడం వల్ల తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని స్పౌజ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన స్పౌజ్​టీచర్ల బదిలీలను వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదివారం సిద్దిపేట జిల్లాలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయం వరకు 13 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణ మాట్లాడుతూ.. 10 నెలలుగా ఉపాధ్యాయ కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని వాపోయారు. కనీసం దేవుడైనా కురుణించి తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ‘ఉపాధ్యాయ దంపతులు ఒకే చోట విధుల్లో ఉంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని’ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. 317 జీఓ ప్రకారం సీనియారిటీ ఆధారంగా టీచర్లను వారి వారి జిల్లాలకు కేటాయించిన ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్​లో పెట్టడం అన్యాయం అన్నారు. సిద్దిపేట నుంచి బయలుదేరిన పాదయాత్రలో13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులు, పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో టీచర్లు వివేక్, నరేశ్, అనిత, రేఖ, అర్చన, ఖాధర్, మమత, విజయలక్ష్మి, గీతాంజలి, హేమలత, కృష్ణ, త్రివేణి, మాధవి, మహేశ్​తదితరులు పాల్గొన్నారు.