పిల్ల కాదు.. చిచ్చర పిడుగు..దొంగను తరిమికొట్టిన 13 ఏండ్ల బాలిక

పిల్ల కాదు.. చిచ్చర పిడుగు..దొంగను తరిమికొట్టిన 13 ఏండ్ల బాలిక
  • అందరినీ అప్రమత్తం చేస్తూ వీధి చివరి దాకా చేజింగ్
  • హైదరాబాద్ చింతల్ భగత్​ సింగ్ నగర్​లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగను 13 ఏండ్ల బాలిక తరిమికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్​భగత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్​లో ఉమామహేశ్వరి అనే మహిళ తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నది. ఈ నెల 9న వారు ఇంటికి తాళం వేసి బయటికెళ్లారు. ఇది గమనించి ఓ దొంగ పట్టపగలే చోరీకి ప్రయత్నించాడు.

 ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తుండగా.. పై పోర్షన్​లో ఉండే భవాని అనే 13 ఏండ్ల బాలిక కింద ఇంట్లో అలికిడి గమనించింది. దిగి వచ్చి చూస్తే.. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ‘ఎవరు నువ్వు?’ అని దొంగను భవానీ నిలదీసింది. మాట్లాడుతుండగానే ఆ దొంగ భవానీని పక్కకు నెట్టేసి పరుగెత్తాడు. అయినప్పటికీ భవాని.. అంతటితో వదిలి పెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్క వారిని అలర్ట్ చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివర దాకా పరుగెత్తింది. 

దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగా, చుట్టుపక్క వారితో పాటు పోలీసులు కూడా భవాని చూపిన తెగువను ప్రశంసించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.