న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి తొమ్మిది నెలల్లో (డిసెంబర్ 31 వరకు) తెలంగాణ రాష్ట్రం మొత్తం రూ. 69,300 కోట్ల రుణాలను సేకరించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం.. ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్టు కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మొదటి త్రైమాసికంలో రూ.17,400 కోట్లు, రెండవ త్రైమాసికంలో రూ. 32,500 కోట్లు, మూడవ త్రైమాసికంలో రూ. 19,400 కోట్లను మొత్తంగా రూ. 69,300 కోట్ల అప్పులను తీసుకున్నదని వెల్లడించారు. దేశంలోని 28 రాష్ట్రాలు చేసిన అప్పుల వివరాలను కూడా మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర రూ. 99,000 కోట్లను అప్పుగా చేసింది. తమిళనాడు రూ.95,300 కోట్లతో, తెలంగాణ రూ.69,300 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
