హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం ఇవ్వడంతోపాటు జాబ్స్ సాధించేలా యువతకు గైడెన్స్ అందించేలా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో.. జిల్లాకు నాలుగు చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. అలాగే జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విద్య, ఉపాధిపై మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు.
ఆధునిక సౌలత్లు కల్పించాలి
శిక్షణ ఇచ్చే క్యాంపస్ రిక్రూట్ మెంట్ కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర యువత దేశవ్యాప్తంగా ఉద్యోగాలు సాధించే విధంగా అవి ఉండాలన్నారు. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి స్టడీ సర్కిల్ లో కంప్యూటర్ లు, అత్యాధునిక సాంకేతిక, మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలన్నారు.
కస్తూర్బాల్లోనూ ఇంటర్ విద్య
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టాలని సీఎం అన్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని నియమించాలన్నారు. కొత్తగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17 కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ ను ఆదేశించారు. బీసీల జనాభా దామాషా ప్రకారం గురుకులాల సంఖ్య పెంచాలన్నారు.
