
తిరుమల, వెలుగు: తిరుమలలో సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం కానుంది. రూ.15 కోట్లతో టీటీడీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రోజూ 80 వేల మంది, రద్దీ రోజుల్లో లక్ష మంది పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్టు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. రూ.62 కోట్లతో మొత్తం 2వేల అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆరేళ్ల కిందటే టీటీడీ నిర్ణయించింది. ఆ పనులు టెండర్ దశవరకు వెళ్లి ఆగిపోయాయి. ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శ్రీవారి ఆలయం, ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, యాత్రీసదన్లు, రద్దీ ఉండే ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 1,330 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ నెల 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సీసీ కెమెరాలతోపాటు 4,200 మంది పోలీసులు, 1,200 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితో పటిష్టంగా భద్రత కల్పించనున్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధాం చేసి అక్కడి నుంచే సెక్యూరిటీని పర్యవేక్షించనున్నట్లు అధికారులు చెప్పారు. తిరుమలలో మరింత సెక్యూరిటీ కోసం ఫేషియల్ రికగ్నిషన్, సస్పీషియస్ అలార్మింగ్, ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రిగకగ్నేషన్, సిచ్యుయేషన్ మేనేజ్మెంట్ సిస్టంలతో ఈ కెమెరాలను అనుసంధానం చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రతే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తెలిపారు. గురువారం తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తోపాటు తిరుమలలోని నాలుగు మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.