‘గుజరాత్’ బరిలో మహిళలు139 మందే

‘గుజరాత్’ బరిలో మహిళలు139 మందే

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 1,621 మంది పోటీలో ఉండగా, వారిలో కేవలం 139 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. వీరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులే 56 మంది ఉన్నారు. అంటే పార్టీల తరఫున పోటీ చేస్తున్నది 83 మంది మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం 182 సీట్లకు డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బీజేపీ 18 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా.. కాంగ్రెస్ 14 మందికి, బీఎస్పీ 13 మందికి, ఆప్ ఆరుగురికి, ఎంఐఎం ఇద్దరికి, సీపీఎం ఒక్కరికి టికెట్లు ఇచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అన్ని సీట్లలో పోటీ చేస్తుండగా.. బీఎస్పీ 101 సీట్లలో, ఎంఐఎం 13 సీట్లలో పోటీ చేస్తోంది. 

కిందటి ఎన్నికలతో పోలిస్తే ఎక్కువే..

కిందటి ఎన్నికలతో పోలిస్తే మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 2017లో మొత్తం 1,828 మంది పోటీ చేయగా, వారిలో 126 మంది మహిళలు ఉన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 12 మందికి, కాంగ్రెస్ 10 మందికి టికెట్లు ఇచ్చాయి. ఈసారి ఈ 2 పార్టీలు మహిళా కోటాను పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చాయి. బీజేపీ నలుగురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ మహిళలకు టికెట్ ఇవ్వగా.. కాంగ్రెస్ నలుగురు ఎస్టీలు, ఒక ఎస్సీ మహిళకు టికెట్ ఇచ్చింది. ఇక ఆప్ ముగ్గురు ఎస్టీ మహిళలకు, ఎంఐఎం ఒక ముస్లిం, మరో దళిత మహిళకు టికెట్ ఇచ్చింది.