వ్యాను, ట్రక్కు ఢీ.. ఆరుగురు పిల్లలతో సహా 14 మంది మృతి

వ్యాను, ట్రక్కు ఢీ.. ఆరుగురు పిల్లలతో సహా 14 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలతో సహా 14 మంది చనిపోయారు. ప్రతాప్‌గర్ జిల్లాలో గురువారం రాత్రి 11.45 గంటల సమయంలో ప్రయాగ్రాజ్-లక్నో హైవేపై మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిన ట్రక్కును వెనుక నుంచి వచ్చిన మహీంద్రా బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. దాంతో బొలెరోలో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషాద సంఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు.

ఈ ఘటనపై ప్రతాప్‌గర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అనురాగ్ ఆర్య మాట్లాడుతూ.. ట్రక్కు టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉంచారు. రాత్రి సమయం కావడంతో ఆపి ఉంచిన ట్రక్కు కనిపించక వేగంగా వచ్చిన బొలేరో కంట్రల్ తప్పి ట్రక్కును ఢీకొట్టింది. బొలేరో స్పీడ్‌గా రావడంతో సగం వరకు బొలేరో లారీ కిందికి దూసుకెళ్లింది. బాధితులందరూ గోండా గ్రామానికి చెందినవారు. వీరంతా ఒక వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.