ప్రధానిపై హత్యాయత్నం కేసులో14 మంది మిలిటెంట్లకు ఉరి

ప్రధానిపై హత్యాయత్నం కేసులో14 మంది మిలిటెంట్లకు ఉరి

ఢాకా (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్‌‌ ప్రధాన మంత్రి షేక్‌‌ హసీనాపై హత్యాయత్నం కేసులో నిందితులను ఆ దేశ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2000వ సంవత్సరం హసీనా పాల్గొనే ఎన్నికల ర్యాలీ జరిగే ప్రాంతంలో బాంబు పెట్టిన నిషేధిత హర్కతుల్‌‌ జిహాద్‌‌ బంగ్లాదేశ్‌‌ (హుజి–బి) సంస్థకు చెందిన 14 మందికి ఉరిశిక్ష వేయాలని తీర్పునిచ్చింది. కాగా, ఇప్పుడు ఉరిశిక్ష వేసిన 14 మంది మిలిటెంట్లలో 9 మంది కోర్టుకు హాజరయ్యారు. మిగిలిన అయిదుగురు మిలిటెంట్లు పరారీలో ఉన్నారు. ఈ కేసును విచారించిన ఢాకా స్పీడీ ట్రయల్‌‌ ట్రిబ్యునల్‌‌ జడ్జి అబు జాఫర్‌‌‌‌ ఎండీ కమ్రుజ్జామన్‌‌ 14 మందిని ఉరితీయాలని తీర్పు చెప్పారు. పరారీలో ఉన్ని నిందితులను అరెస్టు చేసినా, లేక వారే లొంగిపోయినా మరణశిక్ష విధించాలని సూచించారు.

76 కిలోల బాంబు..

2000 జులై లో గోపాల్‌‌గంజ్‌‌ జిల్లాలోని కోటలిపారా ప్రాంతానికి దగ్గరలో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి హసీనా బయలుదేరారు. ర్యాలీ జరిగే గ్రౌండ్‌‌కు దగ్గరలో హుజి–బి సంస్థకు చెందిన మిలిటెంట్లు 76 కిలోల బాంబు పెట్టారు. ర్యాలీ జరిగే ప్రాంతానికి హసీనా హెలికాఫ్టర్‌‌‌‌ చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే భద్రతా బలగాలు బాంబును కనుగొన్నాయి. కొన్నిరోజుల తరువాత అదే ప్రాంతానికి దగ్గరలో మరో 40 కిలోల బాంబును కూడా గుర్తించారు.