V6 News

తమ్ముడికి మందులు వేయాలని.. అమ్మకు చెప్పి వెళ్తూ.. అనంతలోకాలకు!

తమ్ముడికి మందులు వేయాలని.. అమ్మకు చెప్పి వెళ్తూ.. అనంతలోకాలకు!
  • ఐదంతస్తుల నుంచి పడి బాలిక మృతి

మియాపూర్, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్​నుంచి పడి 14 ఏండ్ల బాలిక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్​​గఢ్​కు చెందిన పునీత్ తన భార్య, కూతురు అకాషాని(14), కొడుకుతో కలిసి నగరానికి వలస వచ్చాడు. మియాపూర్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటూ అక్కడి ప్లాట్ నంబర్ 9 జరుగుతున్న భవన నిర్మాణంలో మెస్త్రీగా పనిచేస్తున్నాడు.

శుక్రవారం పునీత్ తన భార్యతో కలిసి భవనం ఐదో అంతస్తులో నిర్మాణ పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారి కుమార్తె అకాషాని.. తమ్ముడికి జ్వరం మందులు వేయాలనే విషయం చెప్పేందుకు ఐదో అంతస్తులో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మెట్ల నుంచి తిరిగి కిందకు వస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గ్రౌండ్ ఫ్లోర్​లో పడిపోయింది. తీవ్ర గాయాలైన బాలికను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది.

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిర్మాణంలో ఉన్న ఈ ఐదంతస్తుల బిల్డింగ్​కు ఎటువంటి పర్మిషన్ లేదని, భవన నిర్మాణదారుడు ఓ జాతీయ పార్టీ నాయకుడు కావడంతోనే పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.