హెచ్‌‌పీవీ వ్యాక్సినేషన్ షురూ ..కింగ్ కోఠి ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దామోదర

హెచ్‌‌పీవీ వ్యాక్సినేషన్ షురూ ..కింగ్ కోఠి ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దామోదర
  • 14 ఏండ్ల ఆడబిడ్డలకు వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్‌‌పీవీ వ్యాక్సిన్​ పంపిణీ రాష్ట్రంలో శనివారం షురూ అయింది. హైదరాబాద్‌‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న బాలికలకు ఈ టీకా వేస్తారు.

హైదరాబాద్, వెలుగు: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) బారి నుంచి ఆడబిడ్డలను రక్షించేందుకు రాష్ట్రంలో హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌‌‌ స్టార్ట్ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌‌‌‌లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌‌‌‌తో కలిసి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. 14 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు హెచ్‌‌‌‌పీవీ టీకా ఇప్పించి వారి భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గార్డాసిల్ వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకోవాలంటే రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఖరీదైన వ్యాక్సిన్‌‌‌‌ను పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు నెలల పాటు కొనసాగే ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న సుమారు 3.5 నుంచి 4 లక్షల మంది బాలికలకు టీకా వేయనున్నట్లు వివరించారు. తొలి నెల రోజులు అన్ని ప్రభుత్వ జనరల్, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. తర్వాత దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్ సీ) ద్వారా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రపంచంలో ముందస్తుగా నివారించగలిగే ఏకైక క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అని, దీనిని అరికట్టేందుకు త్వరలోనే క్యాన్సర్‌‌‌‌ను 'నోటిఫైబుల్ డిసీజ్'గా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం టీకా వేయించుకున్న బాలికలకు మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ రహిత సమాజం కోసం..

సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే ప్రపంచంలో ముందస్తుగా నివారించగలిగే క్యాన్సర్ అని..ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, రాబోయే రోజుల్లో ఈ ముప్పు మరింత పెరిగే ప్రమాదమున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు.

అందుకే ప్రభుత్వం ఈ క్యాన్సర్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోందన్నారు.  త్వరలోనే క్యాన్సర్‌‌‌‌ను నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.అనంతరం వ్యాక్సిన్ వేయించుకున్న బాలికలకు మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు,  టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అజ్మీర్​లో ప్రారంభించిన మోదీ 

అజ్మీర్: యుక్తవయసులో ఉన్న బాలికలు, మహిళలను గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నుంచి రక్షించే లక్ష్యంతో రూపొందించిన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్​పీవీ) వ్యాక్సినేషన్​ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాజస్తాన్​లోని అజ్మీర్​లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కుటుంబంలో ఒక తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ఇల్లు చెల్లాచెదురవుతుంది. ఒకవేళ తల్లి ఆరోగ్యంగా ఉంటే.. ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

రాజస్తాన్‌‌‌‌లో రూ. 17 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అలాగే, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌‌‌‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త డ్రైవ్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల వయస్సు గల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు గార్డాసిల్ 4 (క్వాడ్రివాలెంట్ హెచ్​పీవీ వ్యాక్సిన్) ​అనే సింగిల్​డోస్​వ్యాక్సిన్​ఇస్తారు.

ఈ వ్యాక్సిన్​ హెచ్​పీవీ టైప్ 16, 18, ​6, 11 రకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. గుర్తించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్​ సెంటర్లు, సబ్​ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ప్రభుత్వ మెడికల్​ కాలేజీలలో ఈ టీకాను ఫ్రీగా అందిస్తారు. రెగ్యులర్ ఇమ్యూనైజేషన్ రోజుల్లోనూ అందుబాటులో ఉంటుంది.