
హైదరాబాద్ : ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. 177 ఇంజినీరింగ్ కాలేజీల్లో 79,346 కన్వీనర్ కోటా సీట్లుండగా.. రెండు విడతల్లో కలిపి 63,899 భర్తీ అయ్యాయి. ఇంకా 15,447 బీటెక్ సీట్లు మిగిలిపోయాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 27 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,914 సీట్లుండగా.. వాటిలో 3,771 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 1,143 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 159 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 72,954 సీట్లుంటే.. 59,054 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 13,900 సీట్లు మిగిలిపోయాయి. రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,478 సీట్లుంటే.. 1,074 భర్తీ అయ్యాయి. బీఫార్మసీ(ఎంపీసీ స్ర్టీమ్)లో 115 కాలేజీల్లో 3,409 సీట్లుంటే.. కేవలం 36 సీట్లు భర్తీ అయ్యాయి.
56 ఫార్మాడీ కాలేజీల్లో 616 సీట్లుంటే 24 మాత్రమే నిండాయి. మొత్తం ఫార్మసీ కేటగిరీలో 4,025 సీట్లకు కేవలం 60 మాత్రమే నిండాయి. కంప్యూటర్ సైన్స్ , ఐటీ రిలేటెడ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. వాటికి అనుబంధంగా ఉన్న 17 కోర్సుల్లో 49,031 సీట్లుంటే, 45,775 (93%) సీట్లు నిండాయి. సీఎస్-ఈలో 20,257 సీట్లకు 19,553, సీఎస్-ఎంలో 9,711 సీట్లకు 8,709, ఐటీలో 5,345 సీట్లకు 5,184 సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ర్టానిక్స్ అండ్ ఎలక్ర్టికల్ కోర్సుల్లో 18,825 సీట్లుంటే, 14,265 సీట్లు నిండాయి. సివిల్ మెకానికల్ తదితర కోర్సుల్లో 10,286 సీట్లకు కేవలం 3,328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కాగా సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 28లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.