ఈ ఏడాది కశ్మీర్‌ ఎన్‌కౌంటర్లలో 172 మంది ఉగ్రవాదులు హతం

ఈ ఏడాది కశ్మీర్‌ ఎన్‌కౌంటర్లలో 172 మంది ఉగ్రవాదులు హతం

2022లో కశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లలో 172 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో 41 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాదిలో కశ్మీర్‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు చెప్పారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)/లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన 108 మంది ఉగ్రవాదులు , జైషే మహ్మద్ (జేఎం)కు చెందిన 35 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అన్నారు. 

2022లో 74 మంది లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్ర సంస్థలో చేరారని, వారిలో 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నారని ఏడీజీపీ కుమార్ తెలిపారు. 2022లో 100 మంది కొత్తగా ఉగ్రవాద సంస్థల్లో చేరారని, అంతకుముందు ఏడాది కన్నా ఇది 37 శాతం తక్కువని చెప్పారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టుల్లో 17 మందిని అరెస్టు చేయగా, 65 మంది హతమయ్యారని, 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాదిలో ఉగ్రవాదుల నుంచి 360 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 121 ఏకే సిరీస్ రైఫిల్స్, 08 ఎమ్ 4 కార్బైన్, 231 పిస్టల్స్ ఉన్నాయని చెప్పారు. ఐఈడీలు, బాంబులు, గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకోవడం వల్ల భారీ ఉగ్ర కుట్రల్ని నివారించగలిగామని చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వారిలో ముగ్గురు కశ్మీర్ పండిట్లు ఉన్నారని ఏడీజీపీ కుమార్ చెప్పారు.