జ్యోతిష్యుడి ఇంట్లో 18 కోట్ల నకిలీ నోట్లు

జ్యోతిష్యుడి ఇంట్లో 18 కోట్ల నకిలీ నోట్లు
  • రంగురాళ్ల చోరీ విచారణలో కొత్త ట్విస్ట్
  • జాతిరత్నం రంగురాళ్ల చోరీ జరిగిందని తప్పుడు ఫిర్యాదు
  • కేసు విచారణ చేస్తుండగా.. అతని అనుచరులే చోరీ చేసినట్లు గుర్తింపు
  • నకిలీ నోట్లని తెలియక చోరీ చేసి చెలామణికి యత్నించిన అనుచరులు
  • పోలీసుల విచారణలో తీగ లాగితే డొంకంతా బయటపడింది
  • సీబీఐ కేసులో 90 కోట్ల హవాలా డబ్బు ఆరోపణలతో జైలుకు వెళ్లొచ్చిన జ్యోతిష్యుడు
  • జైలు నుంచి తిరిగొచ్చాక రంగురాళ్లు, జ్యోతిష్యం మాటున నకిలీ నోట్ల చెలామణి

హైదరాబాద్: రంగురాళ్ల చోరీ విచారణ కోసం వెళ్లిన పోలీసులకు కట్టల కట్టల డబ్బులు కనిపించాయి. పరిశీలించి చూస్తే నకిలీనోట్లని తెలిసిపోయింది. నాగోల్ నివాసం ఉంటున్న ప్రముఖ  జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ కు చెందిన రెండు ఇళ్లలో ఇవి పట్టుపడడం కలకలం రేపుతోంది. గతంలో90 కోట్ల హవాలా డబ్బు కేసును ఎదుర్కొంటున్న ఈయన జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చాడు. హవాలా కేసు నడుస్తుండగానే తిరిగి పాతబాటలోనే నకిలీ నోట్లతో హవాలా బిజినెస్ నడుపుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. దాదాపు 18 కోట్ల రూపాయల నకిలీ నోట్లు పట్టుపడడం సంచలనం రేపుతోంది. జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మతోపాటు అతనికి సహకరిస్తున్న మరో ఆరుగురిని ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 
ఈ సందర్భంగా ఎల్బీనగర్ డీసీపీ యాదగిరి మీడియా సమావేశం పెట్టి వీరి అరెస్టును ధృవీకరించారు. సీజ్ చేసిన 18 కోట్ల నకిలీ నోట్ల కట్టలను మీడియాకు చూపించారు. ఈనెల 14న జాతిరత్నం రంగురాళ్లు చోరీ చేసినట్లు మురళీకృష్ణ శర్మ తప్పుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అనుమానం వచ్చింది. రంగురాళ్ల పేరు, జ్యోతిష్యం మాటున నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున హవాలా బిజినెస్ నడుపుతున్నారని నిఘా పెట్టగా.. హైదరాబాద్ లో రెండు చోట్ల ఇళ్లు తీసుకుని వాటిలో నకిలీ నోట్లు ఉంచుతున్నట్లు గుర్తించారు. ఎల్బీనగర్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు ఉమ్మడిగా దాడులు చేయగా.. రంగురాళ్ల చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 
బెల్లంకొండ మురళి కృష్ణ  శర్మ వద్ద అనుమానాస్పదంగా  90 కోట్ల డబ్బు దొరకడంతో సీబీఐ హవాలా కేసు నమోదు చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు తిరిగి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. ఇతని వద్ద ఏడుగురు సహాయకులుగా పనిచేస్తున్నారు. అవి నకిలీ నోట్లని తెలియక వీరు చోరీ చేసి చెలామణి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నకిలీ నోట్లు పోయిన విషయం దాచిపెట్టి రంగు రాళ్లు పోయినట్లు మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారిస్తుండగా.. ఇతని అనునచరుల వద్ద నకిలీ నోట్లు దొరికాయి. వాటి గురించి ఆరా తీయగా అసలు సూత్రధారి మురళీకృష్ణ శర్మేనని తేలింది. పక్కా ఆధారాలతో పోలీసులు నిఘా పెట్టగా... మురళీకృష్ణ హైదరాబాద్ లో రెండు చోట్ల ఇళ్లు తీసుకుని వాటిలో నకిలీ నోట్లు ఉంచి చెలామణి చేస్తున్నట్లు బయటపడింది.  
వీరి అరెస్టు సందర్భంగా నిందితుడు మురళి కృష్ణ వద్ద రూ.6 లక్షల నగదు మిగిలిన 6 మంది నిందితుల నుండి 32 వేళ నగదు, ఒక కట్టర్, ఒక కారు, 10 మొబైల్స్ ఫోన్లతోపాటు  17.72 కోట్ల రూపాయల నకిలీ 2000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లను బేగం బజారు నుంచి తీసుకుని వచ్చినట్లు బెల్లంకొండ మురళీకృష్ణ చెబుతున్నాడు. 
మురళి కృష్ణ పెద్ద గా చదువుకోలేదు.. కేవలం కొన్ని శ్లోకాలు వచ్చు.. వాటితో జోతిష్యం చెప్తాను అని అందరినీ మోసం చేస్తున్నాడు.తన దగ్గరకు వచ్చే వ్యక్తులకి జాతి రత్నాలను 300 రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు అమ్మేవాడు. వండర్ వరల్డ్ అనే పత్రికలో ఇతను పని చేశాడు..ఆ అవగాహన తో ఇప్పుడు భక్తి నిధి అనే యాప్, పేపర్ ను నడుపుతున్నాడు. కేవలం పదో తరగత చదువుకున్న మురళీకృష్ణ శర్మ భక్తి నిధి వెబ్ సైట్ మాటున హవాలా బిజినెస్ నడుపుతుండగా సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇతను హవాలా కు సంబంధించిన వ్యక్తిగా తేలింది.