
ముంబై: 2006లో జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో తుది తీర్పును బాంబే హైకోర్టు సోమవారం వెల్లడించింది. 2006లో ముంబై లోకల్ రైళ్లలో పేలుడు ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో సుదీర్ఘ విచారణ అనంతరం తుది తీర్పును బాంబే కోర్టు స్పెషల్ బెంచ్లోని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ సోమవారం వెలువరించారు.
సరైన సాక్ష్యాధారాలు లేనందు వల్ల ఈ కేసులో 12 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ 12 మంది నిందితుల్లో కమల్ అన్సారీ అనే నిందితుడు 2021లో కరోనా సోకి నాగ్పూర్ జైలులో ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన 11 మంది నిందితులు 19 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. బాంబే హైకోర్టు తీర్పుతో ఈ 11 మందికి జైలు జీవితం నుంచి ఊరట దక్కింది.
2006 జులై 11వ తేదీన ముంబై లోకల్ ట్రైన్స్లో 11 నిమిషాల వ్యవధిలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రెషర్ కుక్కర్స్ బాంబులు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మొదటి పేలుడు సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు జరిగింది. ఆఫీస్లకు వెళ్లి లోకల్ ట్రైన్స్లో ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులతో లోకల్ ట్రైన్స్ కిక్కిరిసి ఉన్న సమయం అది.
ALSO READ : ఆపరేషన్ సిందూర్ తో సైనిక బలగాల ప్రతాపం ప్రపంచం చూసింది: పీఎం మోడీ
రెండో బాంబు బ్లాస్ట్ 6 గంటల 35 నిమిషాల సమయంలో జరిగింది. చర్చ్ గేట్ నుంచి వెళుతున్న ట్రైన్స్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్లో దుండగులు బాంబులను అమర్చి ఈ దుశ్చర్యకు పాల్డడ్డారు. మాతుంగ రోడ్, మహీమ్ జంక్షన్, బాంద్రా, ఖర్ రోడ్, జోగేశ్వరి, బొరివాలి రైల్వే స్టేషన్ల దగ్గర ఈ పేలుళ్లు జరిగాయి.