హైదరాబాద్ లో ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ స్కాం... పార్ట్‌‌‌‌టైమ్ జాబ్ పేరుతో రూ.19 లక్షలు కొట్టేసిన్రు

హైదరాబాద్ లో ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ స్కాం... పార్ట్‌‌‌‌టైమ్ జాబ్ పేరుతో రూ.19 లక్షలు కొట్టేసిన్రు

మేడిపల్లి, వెలుగు: ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పార్ట్‌‌‌‌టైమ్ ఉద్యోగం పేరుతో వల వేసిన సైబర్ నేరగాళ్లు, పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఓ గృహిణి నుంచి రూ.19.19 లక్షలు కాజేశారు. ఈ ఘటనపై మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీకి చెందిన దువ్వూరి సీత కల్యాణి(58) జూన్ 12న ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో కనిపించిన ప్రకటనను క్లిక్ చేయగా టెలిగ్రామ్‌‌‌‌కు మళ్లించారు. 

అక్కడ తమను ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ప్రతినిధులు, సీఈవోగా పరిచయం చేసుకున్న మోసగాళ్లు తొలుత చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కల్పించారు. ఆ తర్వాత పెట్టుబడులు, అకౌంట్ యాక్టివేషన్, ఫ్రీజ్ తొలగింపు, విత్‌‌‌‌డ్రా ప్రాసెసింగ్ పేర్లతో విడతల వారీగా భారీ మొత్తంలో వసూలు చేశారు. అనంతరం డబ్బు తిరిగి ఇప్పిస్తామని చెప్పి హ్యాండ్‌‌‌‌రైటింగ్ ఉద్యోగం పేరుతో మరోసారి మోసానికి పాల్పడ్డారు. 

స్టేషనరీ, ఆధార్, పాన్ ధ్రువీకరణ, ప్రాసెసింగ్, పన్నులు, బ్యాంకు ఛార్జీల పేర్లతో మరిన్ని డబ్బులు వసూలు చేసి బాధితురాలిని మోసం చేశారు. తాను మొత్తం రూ.19,18,992 కోల్పోయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.