EWS ‌ కోటాలో 190 మెడికల్‌‌ సీట్లు

 EWS ‌ కోటాలో 190 మెడికల్‌‌ సీట్లు

ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్‌‌ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్‌‌ కోటా అమలుకానుంది. అందుకు అవసరమైన సీట్లు పెంచుకునేందుకు మెడికల్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆరు గవర్నమెంట్‌‌ మెడికల్‌‌ కాలేజీల్లో 190 సీట్ల పెంపునకు ఓకే చెప్పింది. నిబంధనల ప్రకారం ఈ సీట్లలో 50% సీట్లను అగ్రవర్ణ పేదలకు కేటాయిస్తామని కాళోజి నారాయణరావు హెల్త్‌‌ యూనివర్సిటీ వీసీ, డాక్టర్‌‌‌‌ కరుణాకర్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఈ లెక్కన అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌‌ కోటా కింద 95 సీట్లే దక్కనున్నాయి. మిగిలిన 95 సీట్లలో బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే ఉన్న 1,550 సీట్లను పాత పద్ధతిలోనే భర్తీ చేస్తామని, ఈ సీట్లతో ఈడబ్ల్యూఎస్‌‌ కోటా రిజర్వేషన్లకు సంబంధం ఉండదని కరుణాకర్‌‌‌‌రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని మెడికల్‌‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌‌ కోటా కింద 4,515 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది. అత్యధికంగా మహారాష్ట్రలోని 20 కాలేజీలకు 1,020 సీట్లు కేటాయించింది. ఏపీలోని 10 కాలేజీలకు 360 సీట్లు దక్కాయి.

అనుకున్నన్ని ఎందుకు రాలేదు?..

రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల పెంపునకు మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ విభాగం దరఖాస్తు చేసింది. కానీ, కేవలం ఆరు కాలేజీలకే సీట్లు పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఓ కాలేజీలో 250 సీట్లకు మించి ఉండొద్దు. ఇప్పటికే ఉస్మానియాలో 250 సీట్లు ఉండడంతో అనుమతివ్వలేదు. ఇక ఈ ఏడాదే ఎంసీఐ గుర్తింపు పొందిన నల్గొండ, సూర్యాపేట కాలేజీలకూ ఈడబ్ల్యూఎస్‌‌ కోటా సీట్లు కేటాయించలేదు. మిగిలిన ఆరు కాలేజీలకు కేటాయించిన సీట్లలోనూ ఎంసీఐ కోత పెట్టింది. ఒక్కో కాలేజీలో 25% సీట్ల పెంపుకు అప్లై చేసుకుంటే, కేవలం గాంధీ, కాకతీయ కాలేజీలకే 25% సీట్లు ఇచ్చారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌ కాలేజీలో ప్రస్తుతం 150 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 38 సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 25 సీట్లే కేటాయించారు. సిద్దిపేట కాలేజీలోనూ 150 సీట్లుండగా అదనంగా 25 సీట్లకే అనుమతించారు. నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌లో ప్రస్తుతం 100 సీట్ల చొప్పున ఉన్నాయి. ఈ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున రావాల్సి ఉండగా 20 చొప్పున అనుమతించారు. ఫ్యాకల్టీ కొరత, వసతుల లేమి వల్లే అడిగినన్ని సీట్లివ్వలేదని  వైద్య విద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కేటాయింపునకు ప్రాతిపదిక ఏంటి?…

ఈడబ్ల్యూఎస్‌‌ కోటా సీట్లను ఏ ప్రతిపాదికన ఖరారు చేశారన్న విషయాన్ని ఎంసీఐ వెల్లడించలేదు. గుజరాత్‌‌లో 100 సీట్ల చొప్పున ఉన్న రెండు కాలేజీలకు 50 చొప్పున ఈడబ్ల్యూఎస్‌‌ సీట్లు కేటాయించారు. అస్సాంలో ఓ కాలేజీలో 156 సీట్లు ఉండగా, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 44 కేటాయించారు. మహారాష్ట్రలో 100 సీట్ల చొప్పున ఉన్న ఆరు కాలేజీలకు ఈడబ్ల్యూఎస్‌‌ కోటా కింద 50 చొప్పున అనుమతించారు. అయితే, మన రాష్ట్రంలోని కాలేజీలకు అడిగినన్ని సీట్లు ఎందుకివ్వలేదన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.