
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ప్రధాని మోదీతో సోమవారం(ఆగస్టు11) ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంతో పాటు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు.
ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో జపోరిజ్జియాలోని బస్ స్టేషన్‌పై జరిగిన ఘోరమైన బాంబు దాడిలో డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని జెలెన్స్కీ వివరించారు. శాంతి కోసం దౌత్యపరమైన అవకాశాలు పెరుగుతున్నప్పటికీ రష్యా తన దురాక్రమణ ,ఆక్రమణ ప్రయత్నాలను కొనసాగిస్తోందని, కాల్పుల విరమణకు అంగీకరించడానికి సుముఖత చూపడం లేదని జెలెన్ స్కీ నొక్కి చెప్పారు.
శాంతి స్తాపనకు భారత్ సాయం కోరిన జెలెన్ స్కీ..ఉక్రెయిన్, రష్యా సంక్షోభానికి తెరదించేలా చూపే ఎలాంటి పరిష్కారం అయినా ఉక్రెయిన్ ను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. యుద్దం ఆపేలా అంతర్జాతీయంగా వత్తిడి తీసుకురావాలని కోరారు.
భారత్ వైఖరి..మోదీ స్పందన..
ఉక్రెయిన్ లో త్వరలో శాంతి నెలకొనాలని, ఉక్రెయిన్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధం బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం దీర్ఘకాలంగా వాదిస్తున్న వైఖరిని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శాంతి పునరుద్ధరణకు న్యూఢిల్లీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించారని, పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలను చర్చించారని ప్రధాని కార్యాలయం తెలిపింది.