మొగుడు చెప్పిందే పెళ్లాం వినాలి.. మోడ్రన్‌గా ఉండాలి.. ఇంటి పనులు చేయాలి: జెన్ జెడ్ కుర్రోళ్ల కోరికలు..!

మొగుడు చెప్పిందే పెళ్లాం వినాలి.. మోడ్రన్‌గా ఉండాలి.. ఇంటి పనులు చేయాలి: జెన్ జెడ్ కుర్రోళ్ల కోరికలు..!

బయటకు మోడ్రన్.. లోపల మాత్రం కరుడుగట్టిన సనాతన ఆలోచనలు.. మాటలు మాత్రం తియ్యగా ఉంటాయి.. చేతలు మాత్రం ఘాటుగా ఉంటాయి.. మోడ్రన్ పెళ్లాం కావాలి.. మొగుడి మాటే వినాలి.. మోడ్రన్ లుక్స్ ఉండాలి.. ఇంటి పనులు అన్నీ చేయాలి.. ఆ ఆలోచనలు ఎవరివి అనుకుంటున్నారు.. ఈ కాలం కుర్రోళ్లవే.. అదేనండీ జనరేషన్ జెడ్ కుర్రోళ్లవి. బెండకాయ ముదిరినట్లు ముదిరినా పెళ్లిళ్లు ఎందుకు కావటం లేదు అనేదానికి.. వాళ్ల ఆలోచనలే కారణం అనే సర్వే వివరాలు ఇప్పుడు స్పష్టం చేస్తున్నాయి. పెళ్లాం విషయంలో జనరేషన్ జెడ్.. 1997 నుంచి 2012 మధ్య పుట్టి.. ప్రస్తుతం14 నుంచి 29 ఏళ్ల వయస్సు మధ్య వారి అభిప్రాయం ఇదేనంట.. ఈ సర్వే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జెన్‌జెడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రోగ్రెసివ్ ఆలోచనలు, సమానత్వం, మోడ్రన్ లైఫ్ స్టైల్. కానీ తాజాగా 'కింగ్స్ కాలేజ్ లండన్'.. 'ఇప్సోస్' కలిసి 29 దేశాల్లో చేసిన ఒక గ్లోబల్ సర్వే చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 సందర్భంగా విడుదలైన ఈ రిపోర్ట్ ప్రకారం.. మన జెన్‌జెడ్ కుర్రాళ్ల ఆలోచనలు బయట కనిపిస్తున్నంత మోడ్రన్‌గా లేవని తేల్చేసింది. అసలు ఇంకా ఆడ, మగ అనే తేడాలు వారి మైండ్ లో ఉన్నాయా.. ఇప్పటికీ పాతతరం చింతకాయ పచ్చడి అన్నట్లే వారి ఆలోచనలు కొనసాగుతున్నాయా అనే ఆసక్తికరమైన వివరాలు చూద్దాం.. 

భార్య అంటే భర్త మాట వినాల్సిందేనా?
ఈ సర్వేలో షాకింగ్ విషయం ఏంటంటే.. 31% మంది జెన్ జెడ్ మగవారు భార్య ఎప్పుడూ భర్త మాట వినాలని కోరుకుంటున్నారని వెల్లడైంది. వినడానికి వింతగా ఉన్నా.. పాత తరం వారైన 'బేబీ బూమర్స్'13% మంది కంటే ఈ విషయంలో యువతే ఎక్కువ ట్రెడిషనల్ గా ఆలోచిస్తోంది. అంటే బయట ఎంత సమానత్వం అని చెప్పినా.. ఇంట్లో మాత్రం తామే బాస్ అనిపించుకోవాలని మూడింట ఒక వంతు జెన్ జెడ్ కుర్రాళ్లు కోరుకుంటున్నారు. అలాగే ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలు భర్తవే కావాలని 33% మంది అభిప్రాయపడ్డారటం ఆసక్తికరంగా ఉంది. 

సక్సెస్‌ఫుల్ మహిళలంటే ఇష్టం:
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కెరీర్‌లో దూసుకుపోయే, సక్సెస్‌ఫుల్ మహిళలంటే తమకు చాలా ఇష్టమని 41% మంది జెన్ జెడ్ అబ్బాయిలు చెప్పారు. అంటే ఆఫీసులో మేడమ్ గొప్పగా ఉండాలి.. కానీ ఇంట్లో మాత్రం భర్త మాటకు ఎదురు చెప్పకూడదు అనే విచిత్రమైన డ్యూయాలిటీ ధోరణి జెన్ జెడ్ కనిపిస్తోంది. అలాగే 24% మంది అబ్బాయిలు.. అమ్మాయిలు మరీ అంత ఇండిపెండెంట్‌గా కనిపిస్తే బాగోదని ఫీలవుతున్నారు కూడా.

►ALSO READ | మనదేమన్నా బనానా రిపబ్లికా..? ఆయిల్ కొనటానికి అమెరికా అనుమతేంటి..? ఏకిపారేసిన కాంగ్రెస్

మ్యాన్లీ అంటే.. కండలు ఉండాలి, ఏడవకూడదు:
మగతనం గురించి కూడా జెన్ జెడ్ అబ్బాయిల్లో పాతకాలపు భావాలు గట్టిగానే ఉన్నాయట. సుమారు 43% మంది యువకులు.. ఒక అబ్బాయి చూడటానికి ఫిజికల్‌గా చాలా టఫ్ గా కనిపించాలని నమ్ముతున్నారు. అది వారి సహజ స్వభావం కాకపోయినా.. సమాజం కోసం అలా బిల్డప్ ఇవ్వాలని వారు భావిస్తున్నారు. ఇకపోతే.. తన మగ ఫ్రెండ్స్‌కు "ఐ లవ్ యు" అని చెబితే అది మగతనం కాదని 30% మంది నేటి తరం కుర్రోళ్లు ఫీలవుతుండటం విశేషం. భావోద్వేగాలను పంచుకోవడం కూడా వీరికి ఇంకా ఇబ్బందిగానే ఉందని సర్వే తేల్చేసింది.

పిల్లల పెంపకం.. అబ్బాయిల పనా?
సాధారణంగా ఈ తరం అబ్బాయిలు ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో పాలుపంచుకుంటారని మనం అనుకుంటాం. కానీ 21% మంది జెన్ జెడ్ అబ్బాయిలు.. పిల్లలను చూసుకునే మగాళ్లకు మగతనం తక్కువ అని మార్కులు వేస్తున్నారట. బేబీ బూమర్స్ అదే పాతతరం వారి కంటే ఈ విషయంలో జెన్ జెడ్ మగవారే వెనకబడి ఉండటం ఆశ్చర్యకరం.

ఈ తరం యువత సోషల్ మీడియాలో సమానత్వం గురించి వింటున్నా.. లోలోపల పాత సామాజిక నిబంధనల నుంచి బయటపడలేకపోతున్నారని తాజా సర్వే వివరాలు కుండ బద్ధలు కొట్టినట్లు బయటపెట్టాయి. ఇది కేవలం అమ్మాయిల మీద ఆంక్షలు పెట్టడమే కాదు, అబ్బాయిలు కూడా తమను తాము ఒక గీత లోపల బంధించుకుంటున్నారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మోడ్రన్ లుక్‌లో ఉన్న పాతకాలపు ఆలోచనలకు ప్రతిరూపంగా జెడ్ జెడ్ కుర్రోళ్లు మారినట్లు తాజా సర్వేలోని అంశాలను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.