
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, జనరల్ అసిమ్ మునీర్ భారత్‌పై మరోసారి విషం వెళ్లగక్కాడు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా గడ్డ మీద నుంచి ఇండియాపై బెదిరింపులకు దిగాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మునీర్.. వ్యాపారవేత్త, గౌరవ కాన్సుల్ అద్నాన్ అసద్ టంపాలో నిర్వహించిన బ్లాక్-టై విందులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ అణ్వాయుధ దేశం. భారత్ నుంచి పాక్ ఉనికికి ముప్పు వాటిల్లితే.. మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తాం’’ అని అమెరికా సాక్షిగా అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇండియా తమపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు.
సింధూ నది జలాల ఒప్పందం రద్దుపై కూడా బరితెగింపు మాటలు మాట్లాడాడు మునీర్. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత మిస్సైళ్లతో ఆనకట్టను ధ్వంసం చేస్తామని.. మాకు క్షిపణల కొరత కూడా లేదని హెచ్చరించాడు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని బలుపు మాటలు మాట్లాడాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని న్యూఢిల్లీ తీసుకున్న నిర్ణయం 250 మిలియన్ల మందిని ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
►ALSO READ | గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతి
కాగా, ఆపరేషన్ సిందూర్ తో తర్వాత అమెరికాలో మునీర్ పర్యటించడం ఇది రెండోసారి. తొలిసారి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ప్రత్యేకంగా భేటీ అయిన పాక్ ఆర్మీ చీఫ్.. తాజా పర్యటలో పలువురు అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులతో కలిశారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ మునీర్ వరుసగా అమెరికాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భారత్ పై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోన్న అమెరికా.. పాక్ తో సన్నిహితంగా మెలుగుతోంది. భారత్ అదనపు సుంకాలు విధిస్తూ.. పాకిస్థాతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకుంటుంది.