
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం (ఆగస్ట్ 11) రాత్రి గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు అంతర్జాతీయ వార్త సంస్థ అల్ జజీరా జర్నలిస్టులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. మృతుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నారని అల్ జజీరా తెలిపింది.
ఈ దాడి తామే చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. జర్నలిస్టు ముసుగులో ఉన్న టెర్రరిస్ట్ అనాస్ అల్-షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. అనాస్ అల్-షరీఫ్ ఒక ఉగ్రవాది అని.. అతడు హమాస్‌లోని ఒక ఐటీ సెల్ విభాగానికి అధిపతిగా పనిచేశాడని ఆరోపించింది. ఈ దాడికి కొన్ని నిమిషాల ముందే.. గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు అనాస్ అల్-షరీఫ్. ఇది జరిగిన కాసేపటికే ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మరణించాడు.
అల్ షరీఫ్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను అల్ జజీరా తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. ఈ దాడిని గాజా ఆక్రమణకు ముందు ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ఇజ్రాయెల్ చేసిన తీవ్ర ప్రయత్నమని పేర్కొంది. సరైన ఆధారాలు చూపించకుండానే తమకు వ్యతిరేకంగా పని చేసే జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్ర వేసే అలవాటు ఇజ్రాయెల్‌కు ఉందని జర్నలిస్ట్‌ల రక్షణ కమిటీ (CPJ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తన రిపోర్టింగ్ కారణంగా అల్ షరీఫ్ ప్రాణాలకు ముప్పు ఉందని యూఎన్ సభ్యురాలు ఐరీన్ ఖాన్ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.