
Jhunjhunwala: గతవారం నిరంతర నష్టాల నుంచి స్వల్ప ఉపశమనాన్ని చూస్తు్న్నాయి స్టాక్ మార్కెట్లు కొత్త వారంలో. స్టాక్ మార్కెట్లోని ప్రముఖ ఇన్వెస్టర్లలో ఒకరు జున్‌జున్‌వాలా ఫ్యామిలీ. రాకేష్ మరణం తర్వాత ప్రస్తుతం రేఖాతో పాటు ఆయన ట్రస్ట్ పెట్టుబడుల వ్యవహారాలను చూసుకుంటున్నారు. చాలా మంది వీరి పోర్ట్ ఫోలియోను, పెట్టుబడులను నిరంతరం పరిశీలిస్తూ ఫాలో అవుతుంటారు.
సోమవారం మార్కెట్లు ప్రారంభం అయిన తర్వాత దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన కాంకర్డ్ బయోటెక్ కంపెనీ షేర్లు 8 శాతం క్రాష్ అయ్యాయి. దీంతో కేవలం రెండు నిమిషాల్లోనే జున్‌జున్‌వాలా సంపద రూ.309 కోట్ల ఆవిరైంది. ఫార్మా కంపెనీ విలువ దాని గరిష్ఠాల నుంచి సగానికి తగ్గటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురైనట్లు నిపుణులు చెబుతున్నారు.
నేడు ఇంట్లాడేలో కాంకర్డీ స్టాక్ రూ.1479 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు శుక్రవారం స్టాక్ ధర రూ.1600 స్థాయిలో క్లోజ్ అయ్యింది. ఏడాది ప్రాతిపధికన మెుదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 30 శాతం తగ్గటం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆదాయాలు కూడా తగ్గుదలను చూశాయి. కంపెనీలో జున్‌జున్‌వాలా ఫ్యామిలీ ట్రస్టులు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కంపెనీకి చెందిన 2.51 కోట్ల షేర్లను జున్‌జున్‌వాలా పిల్లల పేరుతో ఉన్న ట్రస్ట్స్ హోల్డ్ చేస్తున్నాయి. వీటి విలువ నేడు రూ.4వేల 033 కోట్ల నుంచి రూ.3వేల 727 కోట్లకు పడిపోయింది.
1984లో స్థాపించబడిన కంపెనీ దేశంలోని ఉత్తమ ఫార్మా కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. బ్రోకరేజ్ సంస్థ యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.2వేల 110గా ఫిక్స్ చేసింది. ఇదే క్రమంలో కంపెనీ షేర్లకు బై రేటింగ్ కూడా అందించింది.