
- స్కూళ్లకు చేరుతున్న టెన్త్ లాంగ్ మెమోలు.. పోస్ట్ ద్వారా పంపుతున్న బోర్డు అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ పాసైన విద్యార్థులకు లాంగ్ మెమోలు త్వరలోనే అందనున్నాయి. పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా మూడు రోజుల నుంచి స్కూళ్లకు మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు )) అధికారులు పంపిస్తున్నారు. వారంలోపే అన్ని బడులకు ఇవి చేరనున్నాయి. రాష్ట్రంలో మార్చి నెలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు, జూన్లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షల్లో సుమారు ఐదు లక్షల మంది వరకూ విద్యార్థులు పాసయ్యారు. దీంతో 11,500 హైస్కూళ్ల వారిగా ఒకేషనల్ కోర్సుల మెమోలతో కలిపి మొత్తం 5.33 లక్షల మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతిరోజూ 2వేలు, 3వేల స్కూళ్లకు మెమోలను పంపిస్తున్నారు. అయితే, గతంలో అక్టోబర్ నెల వరకూ టెన్త్ మెమోలు స్కూళ్లకు చేరేవి. కానీ, ఈ ఏడాది రెండు నెలల ముందే స్కూళ్లకు చేరుతుండటంతో గమనార్హం. కాగా, వారంలోపే అన్ని బడులకు మెమోలు చేరేలా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మెమోలు రాగానే హెడ్మాస్టర్లు చెక్ చేసుకోవాలని సూచించారు. మెమోలపై ఫొటోలు, మార్కులు, స్టూడెంట్ల వివరాలను మరోసారి రీచెక్ చేయాలని, తప్పులేమైనా కనిపిస్తే వెంటనే డీఈఓలకు తెలపాలని సూచించారు.