కర్ణాటక కాంగ్రెస్లో కీలక పరిణామం..మంత్రి రాజన్న రాజీనామా

కర్ణాటక కాంగ్రెస్లో కీలక పరిణామం..మంత్రి రాజన్న రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక సహకార శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కె.ఎన్.రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. రాజన్న రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. బీజేపీ ఓట్లు దొంగిలించి గెలిచిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న క్రమంలో రాజన్న చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తికి లోనైంది. దీంతో రాజన్నపై చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  కె.ఎన్. రాజన్న సోమవారం(ఆగస్టు 11)  తన పదవి నుంచి వైదొలిగారు. 

పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలను బహిరంగంగా విమర్శించారు రాజన్న..పార్టీ అగ్ర నాయకుడిపై రాజన్న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి చెంది, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంను ఆదేశించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ చర్య రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. గతంలో రాజన్న తన పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. "నేను నా రాజీనామాను సమర్పించలేదు. నేను ముఖ్యమంత్రితో మాట్లాడి నా వివరణ ఇస్తాను" అని ఆయన అన్నారు. అయితే దీని తర్వాత కొద్దిసేపటికే ఆయన కర్ణాటక మంత్రివర్గంలో తన పదవికి రాజీనామా చేశారు.

రాజన్న రాజీనామాను ఆమోదించిన గవర్నర్

మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాజన్నను హైకమాండ్ డెడ్ లైన్ విధించింది.. సోమవారం సాయంత్రం వరకు రాజీనామా చేయకపోతే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రాజన్నతో విడిగా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజన్న తన రాజీనామాను సీఎం అందజేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కూడా కెఎన్ రాజన్న మంత్రి మండలి రాజీనామాను వెంటనే ఆమోదించారు.