జమ్మూలో ఎన్ కౌంటర్.. నలుగురు సైనికులు మృతి

జమ్మూలో ఎన్ కౌంటర్.. నలుగురు సైనికులు మృతి
  • కార్డన్ సెర్చ్ ఆపరేషన్​లో ఎదురుకాల్పులు

శ్రీనగర్/ జమ్మూ: జమ్మూకాశ్మీర్​లోని రాజౌరీలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. కార్డన్ సెర్చ్​ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలపైకి టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో ఇద్దరు సైనికులు స్పాట్​లోనే ప్రాణాలు విడవగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. రాజౌరీ జిల్లాలోని కాలాకోట్ అడవుల్లో బుధవారం చోటుచేసుకుందీ దారుణం. వీరమరణం పొందిన వారిలో ఆర్మీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు, ఇద్దరు సోల్జర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో టెర్రరిస్టుల ఉనికికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దట్టమైన అడవులలో నక్కిన టెర్రరిస్టులు బలగాల రాకను గమనించి కాల్పులు జరిపారు. సైనికులు వెంటనే తేరుకుని దీటుగా జవాబిచ్చారు. అయితే, ఈలోపే ఇద్దరు సైనికులు టెర్రరిస్టుల తూటాలకు బలయ్యారు. బుల్లెట్​ గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతూనే సైనికులను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు.

టెర్రర్ లింకులతో నలుగురు ఉద్యోగుల డిస్మిస్

టెర్రర్ గ్రూపులతో సంబంధం ఉందనే ఆరోపణలతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ డిస్మిస్ చేసింది. ఈ నలుగురు పాక్ టెర్రరిస్టులకు రాకపోకల్లో సాయం చేయడం, నిధుల చేరవేత, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. దీంతో రాజ్యాంగంలోని 311(2)(సీ) ప్రకారం డాక్టర్ నిసార్ ఉల్ హసన్, కానిస్టేబుల్ అబ్దుల్ మజీద్​ భట్, ల్యాబ్ బేరర్ అబ్దుల్ సలాం, టీచర్ ఫారుక్ అహ్మద్ మీర్ లను విధుల్లో నుంచి తొలగించింది.